
అద్దేపల్లి సాహిత్యం అందరికీ ఆదర్శం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): అద్దేపల్లి రామ్మోహనరావు సాహిత్యం అందరికీ ఆదర్శనీయమని పలువురు వక్తలు అన్నారు. స్థానిక రోటరీ క్లబ్‌లో ఆదివారం రాత్రి ప్రముఖ కవి అద్దేపల్లి రామ్మోహనరావు సాహిత్య పురస్కారం 2025ను రాజమహేంద్రవరానికి చెందిన రెంటాల శ్రీవెంకటేశ్వరరావుకు ప్రదానం చేశారు. వయో భేదం లేకుండా ప్రతి ఒక్కరినీ సాహిత్యంలో ప్రోత్సహించిన గొప్ప సాహితీవేత్త అద్దేపల్లి అని రాజమహేంద్రవరానికి చెందిన ఎస్‌ఆర్ పృథ్వీ అన్నారు. మధునాపంతుల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచీకరణను వ్యతిరేకిస్తూ తన సాహిత్యంలో ప్రతిధ్వనింపజేశారన్నారు. పురస్కార గ్రహీత రెంటాల శ్రీవెంకటేశ్వరరావు మాట్లాడుతూ గజల్స్‌ను అర్థవంతంగా పాడి కొత్త ఒరవడికి అద్దేపల్లి శ్రీకారం చుట్టారన్నారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా శ్రీవెంకటేశ్వరరావు దంపతులకు పురస్కారం అందించారు. ఈ సందర్భంగా వచన కవిత పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అద్దేపల్లి ప్రభు, అద్దేపల్లి రాధాకృష్ణ, వాడ్రేపు వీరలక్ష్మి, గౌరీనాయుడు తదితరులు పాల్గొన్నారు.