
రథంపై సత్యదేవుని ఊరేగింపు
అన్నవరం: రత్నగిరి వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఆదివారం ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని టేకు రథంపై ఘనంగా ఊరేగించారు. ఉదయం పది గంటలకు ఉత్సవమూర్తులను తిరుచ్చి వాహనంపై ప్రతిష్ఠించి అర్చకుడు దత్తాత్రేయశర్మ తదితరులు పూజలు చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా మూడు సార్లు ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవార్లను ఊరేగించి తిరిగి ఆలయానికి చేర్చారు.
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదాన కార్యక్రమానికి రాజమహేంద్రవరానికి చెందిన భక్తులు ఆదివారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. రాజమహేంద్రవరం సత్యనారాయణపురానికి చెందిన కె.సతీష్‌కుమార్ ఆలయ అధికారులను కలసి ఈ విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం దాతలకు ఆలయ అధికారులు, అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.
ఉత్సాహంగా అథ్లెటిక్స్
క్రీడాకారుల ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ డీఎస్‌ఏలో జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. దీనిని జిల్లా అథ్లెటిక్స్ సంఘ సభ్యుడు సాయి, రిటైర్డ్ కోచ్ కొండలరావు, కార్యదర్శి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. అండర్–14, 18 బాలుర, బాలికల విభాగ ఎంపికలకు 250 మంది హాజరయ్యారు. వీరికి రన్స్, జంప్స్, త్రోస్‌లో ప్రాథమిక పరీక్షలు నిర్వహించి ప్రతిభ చాటిన 35 మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. వీరు ఈ నెల 25 నుంచి 27 వరకూ ఏలూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని కార్యదర్శి సుబ్రహ్మణ్యం తెలిపారు. పీడీలు బంగార్రాజు, నూకరాజు, త్రిపుల, హరిబాబు, వీరబాబు, డీఎస్‌ఏ కోచ్‌లు ప్రవీణ్, ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కారు ఢీకొని ఎనిమిది గొర్రెల మృతి
పెద్దాపురం: అతి వేగంగా వస్తున్న కారు ఢీకొన్న ఘటనలో గొర్రెల మంద మృతి చెందిన సంఘటన ఆదివారం పెద్దాపురం ఏడీబీ రోడ్డులో చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వెళ్తున్న కారు వేగంగా వస్తూ స్థానిక వెంకటేశ్వర పౌల్ట్రీ సమీపంలోని రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందను ఢీకొంది. ఈ ప్రమాదంలో గండేపల్లి మండలం సూరంపాలెం వాసి కొరికట్ల సుబ్బారావుకు చెందిన ఎనిమిది గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. కారు డ్రైవర్‌ను పెద్దాపురం పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

స్థానికం

స్థానికం