
స్వామీ.. నీ చెంత నీరేమీ!
● ముంపు నీట మురమళ్ల వీరేశ్వరుని ఆలయం
● ముందుకు కదలని ఆలయ పునర్నిర్మాణ పనులు
● రూ.4.50 కోట్లు మంజూరైనా మొదలు కాని వైనం
ఐ.పోలవరం: ప్రసిద్ధి చెందిన మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం వర్షం వస్తే ముంపునీటి వెతలు ఎదుర్కొంటుంది.. శతాబ్దాల కిందట నిర్మించిన ఈ ఆలయం కొద్దిపాటి వర్షానికే నీట మునుగుతుంది. ఈ ఆలయ పునర్నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరైనా గ్రహణం వీడడం లేదు. ఈ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయోనని భక్తులు ఎదురు చూస్తున్నారు. నిత్యం వందలాది మంది భక్తులు కల్యాణాలకు, దర్శనాలకు వచ్చే వస్తుంటారు. మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఇక భక్తజన కోలాహలమే. ఇక్కడి సమస్యలపై పాలకులు, అధికారులు స్పందిస్తున్న తీరును వారు తప్పుపడుతున్నారు.
వృద్ధ గౌతమీ గోదావరి నదీ తీరాన్ని ఆనుకుని ఉన్న మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయం ప్రముఖ శైవ క్షేత్రంగా పేరొందింది. పెళ్లికాని వారు ఇక్కడ కల్యాణం చేయించుకుంటే వివాహం జరుగుతోందని నమ్మకం. దీంతో ప్రతి రోజూ ఇక్కడ 116 కల్యాణాల వరకూ జరుగుతున్నాయి. ఇది కాకుండా మహాశివరాత్రి, బ్రహ్మోత్సవాలు, లక్ష రుద్రాక్ష పూజలకు 20 వేల మంది నుంచి 30 వేల మంది వరకూ భక్తులు వస్తుంటారు. ఇక పుష్కరాల సమయంలో భక్తుల తాకిడి అధికం. సమీపంలోని వృద్ధ గౌతమీ నదీపాయలో పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు.
పనులు ఎప్పుడో..!
ఇంతటి ప్రాముఖ్యం ఉన్న స్వామి ఆలయ పునర్నిర్మాణం ఎప్పుడో అర్థం కావడం లేదు. కొద్దిపాటి వర్షానికి ఇప్పుడున్న ఆలయం జలాశయాన్ని తలపిస్తోంది. ఆలయం చుట్టూ మోకాలు లోతు నీరు రావడంతో పాటు గర్భ గుడిలోకి సైతం నీరు చేరుతోంది. ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి సైతం వర్షాలకు మునుగుతుండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ నైరుతి సీజన్‌లో చెప్పుకొనే స్థాయిలో వర్షాలు లేవు. అడపాదడపా మాత్రమే ఒక మోస్తరు నుంచి భారీ కురుస్తోంది. ఈ వర్షానికి రోడ్డు నీట మునిగి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. భక్తుల దర్శనానికి వీలుగా ద్వారాలు వెడల్పు చేయాల్సి ఉంది. ఆలయ పునర్నిర్మాణ పనులకు రూ.4.50 కోట్లు మంజూరైన విషయం తెలిసిందే. ఈ నిధులతో ఇప్పుడున్న ఆలయాన్ని తొలగించి కొత్త ఆలయాన్ని నిర్మించాల్సి ఉంది. ఇటీవల ఈ పనులు మొదలు పెడతామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంకా పనులు మొదలు కాలేదు. ఇప్పుడే పనులు మొదలు పెట్టకుంటే పుష్కర సమయానికి పూర్తమవుతోందనే నమ్మకం లేదు. వెంటనే పనులు ప్రారంభించాలని భక్తులు కోరుతున్నారు.