
షోడశ సంస్కారాలతో మానవ జన్మ పరిపూర్ణం
అమలాపురం టౌన్: సనాతన భారతీయ విధానంలో షోడశ సంస్కారాలు మానవ జీవనంలో ప్రధానంగా నిలిచాయని విజయనగరం శ్రీవిద్యా పీఠం అధ్యక్షుడు యనమండ్ర సుబ్రహ్మణ్యశర్మ అన్నారు. ఆదివారం అమలాపురం ఆపస్తంబ పురోహిత పరిషత్ ఆధ్వర్యంలో స్మార్తాపర విద్వత్సభ స్థానిక సత్యసాయి కల్యాణ మండపంలో జరిగింది. పరిషత్ స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విద్వత్సభ రజతోత్సవ సభ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా మావుళ్లమ్మ దేవస్థానం ఆస్థాన వేద పండితుడు యీవని రామచంద్ర సోమయాజి ఘనపాఠి అధ్యక్షతన జరిగిన ఆపస్తంబ పురోహిత సభకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 150 మందికి పైగా పురోహితులు హాజరయ్యారు. 16 విధాలైన షోడశ సంస్కారాల ద్వారా మానవ జన్మ పరిపూర్ణం అవుతుందని సుబ్రహ్మణ్యశర్మ స్పష్టం చేశారు. అలాంటి ప్రధాన సంస్కారాలను నిర్వహిస్తూ సమాజాన్ని సన్మార్గంలో నడిపించే వారే పురోహితులన్నారు. పురోహిత్యం అనేది నిబద్ధత, త్రికరణశుద్ధితో నిర్వహించాల్సిన వృత్తి అని పేర్కొన్నారు. సంస్కారాలు చేయించుకునే యజమాని క్షేమం కోరుతూ కర్మలు చేయాలని పురోహితులకు వేద ఘనపాఠీలు సూచించారు. పురోహితులు సమాజంలో మనుషులకు నిర్వహించే సంస్కారాలు, కర్మ కాండల సమయంలో అనుసరించాల్సిన నియమ నిబంధనలను వివరించారు. జ్యోతిష పండితుడు చింతామణి సిద్ధాంతి మాట్లాడుతూ జ్యోతిషపరమైన విశేష అంశాలను వివరించి ముహూర్తం విలువ, విశిష్టతను తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 14 మంది విద్యార్థులకు స్మార్త పరీక్షలను ప్రథమ, ద్వితీయ కక్ష్యలతో నిర్వహించారు. పరీక్షాధికారులుగా స్మార్త పండితులు రాళ్లపల్లి సూర్య సుబ్రహ్మణ్యశర్మ, మంగిపూడి చైతన్యశర్మ వ్యవహరించారు. సభకు హాజరైన ప్రతి పురోహితునికి 10 గ్రాముల వెండి ప్రతిమను అందించారు. ఆపస్తంబ పురోహిత పరిషత్ వ్యవస్థాపకులు తోపెల్ల రామం, శ్రీపాద కరుణేందు మౌళి చిత్రపటాలకు, ఆపస్తంబ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి సభను ప్రారంభించారు. పరిషత్ కార్యదర్శి ఆకొండి పవన్‌కుమార్, కోశాధికారి ఆకెళ్ల రాజబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో పరిషత్ సభ్యులు మరువాడ వెంకన్న, తోపెల్ల చంటి, కర్రా శివయ్య, మూల పళ్లయ్య, పెద్దింటి కృష్ణ, కప్పగంతులు రాము, అనుపిండి మూర్తి, తోపెల్ల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. చివరిగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన పురోహితులను ఘనంగా సత్కరించారు.