
గడ్డి మందు తాగి ఆత్మహత్య
అంబాజీపేట: గడ్డి మందు తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడి సోదరుడు వెంకటేశ్వరరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కె.పెదపూడికి చెందిన దంగేటి సోమేశ్వరరావు అనే సోమేష్ (44) పాత్రికేయుడిగా ఉన్నారు. అతను స్థానికంగా ఉన్న కొబ్బరి తోటలో గడ్డి మందు తాగి ఉండటాన్ని స్థానికులు, బంధువులు గుర్తించారు. వెంటనే సోమేష్‌ను అతని కుటుంబ సభ్యులు అంబాజీపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అమలాపురం కిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అతని బంధువులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై కె.చిరంజీవి వివరించారు.
చెరువులో పడి వ్యక్తి మృతి
పిఠాపురం: చెరువులో పడి ఒక వ్యక్తి మృతి చెందినట్లు గొల్లప్రోలు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. దుర్గాడకు చెందిన బొమ్మిడి వెంకటేష్ (25)కు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. అతను వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 6న మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు సమీప ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం దుర్గాడ కొత్త చెరువులో వెంకటేష్ మృతదేహం కనిపించింది. బహిర్భూమికి వెళ్లినప్పుడు కాలుజారి చెరువులో పడి మృతి చెందినట్లు భావిస్తున్నారు. దీనిపై గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.