చితికిన బతుకులకు మహానేత చేయూత | - | Sakshi
Sakshi News home page

చితికిన బతుకులకు మహానేత చేయూత

Sep 2 2025 7:16 AM | Updated on Sep 3 2025 8:31 AM

మహానేత చేయూత

చితికిన బతుకులకు మహానేత చేయూత

పేద, సామాన్య వర్గాలనే తేడా లేకుండా దుర్భర, దయనీయ పరిస్థితుల్లో ప్రజలు.. తమ జీవితాలు బాగుపడతాయన్న నమ్మకం వారిలో పూర్తిగా సన్నగిల్లిన తరుణమది.. పాలకవర్గం దోపిడీ విధానాలకు బలైపోతూ.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో.. ఇక భగవంతుడే దిక్కని ప్రజలంతా నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న సమయాన.. ఆపద్బాంధవుడిలా అక్కున చేర్చుకున్నాడా మహానుభావుడు. నేనున్నా.. కష్టాలు తీరుస్తానంటూ భరోసా ఇచ్చారు. అనుకున్నదే తడవుగా దీన స్థితిలో ఉన్న ప్రజల తలరాతల్ని.. దిశానిర్దేశం లేని రాష్ట్ర రూపురేఖల్ని మార్చేశారు ఆ మహానేత, జన నాయకుడు.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి.

సాక్షి, రాజమహేంద్రవరం: అభివృద్ధి ప్రదాత.. ప్రజల ఆత్మ బంధువు.. సంక్షేమ దార్శనికుడు.. మెట్ట రైతుల మహనీయుడిగా దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. అక్కమ్మా.. చెల్లెమ్మా.. అంటూ ఆప్యాయత పంచుకుని కుటుంబ సభ్యుడిగా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు మహానేత. తూర్పుగోదావరి జిల్లా సంక్షేమం, అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ, అనేక పథకాలకు శంకుస్థాపనలు చేశారు. 

వ్యవసాయ రంగాన్ని అగ్రభాగాన నిలిపేందుకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. అన్నదాతకు అండగా నిలిచేందుకు బడ్జెట్‌లో సింహభాగం రైతుల సంక్షేమానికి నిధులు కేటాయించారు. ఆరోగ్యశ్రీ ద్వారా వేలాది మందికి మెరుగైన వైద్యం అందించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఊపిరి పోశారు. విద్య, వైద్యం, పర్యాటకం, వ్యవసాయం తదితర రంగాల్లో సంపూర్ణ పురోగతి సాధించి, జిల్లా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తన సుదీర్ఘ పాదయాత్రలో విన్న సమస్యలకు అధికారంలోకి వచ్చాక కార్యరూపం దాల్చారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.

రూ.800 కోట్లతో రాకపోకలకు మార్గం సుగమం

విజయవాడ–విశాఖపట్నం నగరాల మధ్య రాకపోకలు మరింత సౌకర్యవంతంగా చేసేందుకు వైఎస్సార్‌ రూ.800 కోట్లతో గామన్‌ బ్రిడ్జి, అప్రోచ్‌ రోడ్డు పనులు చేపట్టారు. 14 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగ్గా.. 4.5 కిలోమీటర్ల వరకు గోదావరి నదిపై వంతెన నిర్మించారు. 2008లో పనులు ప్రారంభించారు. ఈ నిర్మాణంతో విశాఖ–విజయవాడకు 40 కిలోమీటర్ల మేర దూరం తగ్గింది.

రైతు బాంధవుడిగా ఖ్యాతి

● మహానేత వైఎస్సార్‌ రైతు బాంధవుడిగా ఖ్యాతి గడించారు. పావలా వడ్డీకే రుణాలు, రుణమాఫీతో వెన్నుదన్నుగా నిలిచారు.

● బ్రాహ్మణగూడెంలో రూ.273.28 లక్షలు వెచ్చించి 1200 ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. తద్వారా 600 ఎకరాల్లో ముంపు సమస్యకు పరిష్కారం చూపారు. తాళ్లపూడి మండలంలో 4,950 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.8.59 కోట్లు వెచ్చించి పైడిమెట్ల ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. రూ.360.06 లక్షల వ్యయంతో చాగల్లులో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు.

● తాళ్లపూడి మండలంలో సుమారు రూ.500 కోట్లు వెచ్చించి 16 మండలాల్లో 2,06,600 ఎకరాలకు సాగునీరు అందించే తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. కొవ్వాడ కాలువ వరద ముంపు నివారణకు రూ.56 కోట్ల వ్యయంతో అవుట్‌ ఫాల్‌ స్లూయిజ్‌ నిర్మించారు. దీంతో కొవ్వూరు, పోలవరం, గోపాలపురం నియోజకవర్గాల పరిధిలో 15 వేల ఎకరాలకు వరద ముంపు సమస్య తీరింది. వైఎస్సార్‌ హయాంలోనే పోలవరం ప్రాజెక్టులో ఎక్కువ పనులను పూర్తి చేశారు. కేంద్రం నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకువచ్చారు. కుడి, ఎడమల ప్రధాన కాలువలు తవ్వించారు.

మెట్ట రైతుల మహనీయుడిగా..

మెట్ట ప్రాంత రైతులకు మంచి చేయాలన్న తలంపుతో గోదావరి నదిపై తాడిపూడి సమీపంలో చింతపూడి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. తద్వారా కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరించాలని ప్రయత్నించారు. ఆయన హయాంలో పనులు ప్రారంభించారు. రూ.15.26 కోట్లతో కొవ్వూరు, తాళ్లపూడి, దేవరపల్లి మండలాల్లోని 4,950 ఎకరాలకు సాగునీరు అందించే ఆరికిరేవుల ఎత్తిపోతల పథకం కింద 90 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. కుమారదేవం ఎత్తిపోతల పథకాన్ని రూ.1.75 కోట్లతో పునరుద్ధరించారు.

అభాగ్యులకు కొండంత అండ

నిరాశా నిస్పృహల్లో ఉన్న అభాగ్యులకు మహానేత అండగా నిలిచారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చే రూ.75 పింఛను సొమ్మును రూ.200కు పెంచారు. వికలాంగ పింఛను రూ.500కు పెంచిన ఘనత దివంగత వైఎస్సార్‌కే దక్కుతుంది. ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలు పెంచకుండా సేవలందించారు. ప్రజలపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చూశారు.

పాదయాత్ర పదిలం

దివంగత మహానేత పాదయాత్ర దేశంలోనే ప్రత్యేకత చాటుకుంది. ప్రసిద్ధ రోడ్డు కం రైలు వంతెనపై ఆయన పాదయాత్ర సాగింది. ఆ సమయంలో కొంతమూరు వద్ద అస్వస్థతకు గురయ్యారు. ఈ సందర్భంగా అక్కడే అర గంట పాటు విశ్రాంతి తీసుకుని, తిరిగి యాత్ర కొనసాగించారు. అనంతరం మధురపూడి ఎయిర్‌పోర్ట్‌ ఎదురుగా ఉన్న తోటలో ఆరు రోజుల పాటు వైద్య సేవలు పొందారు. ఈ సందర్భంగా రాజమండ్రిలోని ప్రముఖ నాయకులతో ముచ్చటించారు. అనంతరం 2003లో బస్సు యాత్ర సైతం చేపట్టారు.

నిడదవోలు అభివృద్ధికి అగ్రస్థానం

ఇలాఉండగా నిడదవోలులో 2005లో రాజీవ్‌ నగరబాట సందర్భంగా పట్టణంలో పర్యటించిన మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ.కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రాజీవ్‌ నగర బాటలో పట్టణానికి సుమారు రూ.కోటితో రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, రూ.కోటితో సెంట్రల్‌ విద్యుత్‌ లైటింగ్‌, విద్యానగర్‌లో రూ.10 లక్షలతో నిర్మించిన పార్కును ప్రారంభించారు. బాలాజీనగర్‌లో రూ.1.64 కోట్లతో నిర్మించిన 500 కేఎల్‌ సామర్థం ఉన్న మంచినీటి రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేశారు. పేదలకు సొంతగూడు కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ పథకంలో భాగంగా 28వ వార్డు శివారున ప్రతిష్టాత్మకంగా గృహాలను నిర్మించిన ఘనత వైఎస్సార్‌కే దక్కింది. 832 మంది అబ్ధిదారులకు గృహాలను నిర్మించారు. రూ.70 లక్షలతో నిర్మించిన నూతన మున్సిపల్‌ కార్యాలయానికి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మున్సిపల్‌ కార్యాలయంగా నామకరణం చేశారు.

సేవా కార్యక్రమాలకు వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సన్నద్ధం

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలు, ప్రజలపై ఆయనకున్న అభిమానాన్ని మరోసారి గుర్తు చేసేందుకు వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, ఆయన అభిమానులు సన్నద్ధమవుతున్నారు. పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు ఘన నివాళులు అర్పించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

చితికిన బతుకులకు మహానేత చేయూత1
1/2

చితికిన బతుకులకు మహానేత చేయూత

మహానేత చేయూత2
2/2

చితికిన బతుకులకు మహానేత చేయూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement