
సత్యదేవుని హుండీ నేడు లెక్కింపు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని హుండీలను తెరిచి, భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించనున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి స్వామివారి నిత్యకల్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరగనుంది. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు పర్యవేక్షిస్తారు. దేవస్థానంలో హుండీ ఆదాయాన్ని గత నెల 30న లెక్కించారు. మరలా 32 రోజుల తర్వాత సోమవారం లెక్కించనున్నారు.
బాల్ బ్యాడ్మింటన్‌లో జాహ్మవి, శ్రీలక్ష్మికి తృతీయ స్థానం
సీతానగరం: చినకొండేపూడికి చెందిన విద్యార్థిని జాహ్నవి రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ బాలికల విభాగంలో తృతీయ స్థానం కై వసం చేసుకుంది. ఆదివారం ప్రకాశం జిల్లా చేవూరులో జరిగిన ఈ పోటీల్లో చినకొండేపూడి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న బచ్చు జాహ్నవి, సీనియర్స్ విభాగంలో జిల్లా పరిషత్ హైస్కూల్ స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) ఎం శ్రీలక్ష్మి తృతీయ స్థానం సాధించారు. వీరిని స్కూల్ హెచ్‌ఎం ఎస్ ఉషారాణి, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.
హైవేపై లీకై న ఆయిల్
వాహన చోదకులకు ఇక్కట్లు
రాజమహేంద్రవరం రూరల్: జాతీయ రహదారిపై హుకుంపేట జైహింద్‌నగర్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఓ ఆయిల్ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీకైంది. దీంతో పలువురు వాహనచోదకులు అదుపుతప్పి కిందపడ్డారు. సమాచారం అందుకున్న నేషనల్ హైవే అథారిటీ సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టారు. ఆయిల్ పడిన ప్రాంతంలో ఇసుక వేసి, దానిపై నుంచి వాహనాలు వెళ్లకుండా స్టాప్ బోర్డులు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆయిల్‌పై వేసిన ఇసుకను, స్టాప్ బోర్డులను తీసేశారు. వాహనాలు రాకపోకలకు అనువుగా మారడంతో వాహన చోదకులు ఊపిరి పీల్చుకున్నారు.
సూర్యదేవునికి ప్రత్యేక పూజలు
పెదపూడి: జి.మామిడాడలో ప్రసిద్ధి చెందిన ఉషా, ఛాయ, పద్మిని, సౌంజ్ఞ సమేత సూర్యదేవుడికి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు రేజేటి వెంకటనరసింహాచార్యులు ఆధ్వర్యంలో రుత్వికులు ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు, వ్రత పూజలు నిర్వహించారు.

సత్యదేవుని హుండీ నేడు లెక్కింపు