
పాఠ్యాంశాలుగా మహిళల భద్రతా చట్టాలు
● వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
● రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): మహిళల భద్రతకు సంబంధించిన అంశాలు, చట్టాల సమాచారాన్ని పాఠ్య ప్రణాళికలో చేర్చాలని, వాటిపై ప్రతి వారం విద్యార్థినులకు తరగతులు నిర్వహించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ సూచించారు. మహిళల సంక్షేమం, భద్రత, హక్కులపై రాజమహేంద్రవరంలోని ఐఎంఏ భవనంలో శనివారం జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ విద్యార్థినులు, మహిళలు అనేక రకాల వేధింపులు ఎదుర్కొంటున్నారని, ధైర్యంగా ముందుకు వచ్చి వాటిపై ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళల భద్రత కోసం శక్తి యాప్ తో పాటు, 112, 181 కాల్ సెంటర్లు ఉన్నాయని తెలియజేశారు. వన్ స్టాప్ సెంటర్ల ద్వారా మహిళలకు వసతి (షెల్టర్) కల్పించడంతో పాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తారన్నారు. సెల్‌ఫోన్ వినియోగంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళా కమిషన్ సభ్యురాలు కె.జయశ్రీ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి లింక్‌లను క్లిక్ చేయకున్నా ఫోన్‌కు మార్ఫింగ్ ఫొటోలు రావ డం వంటి కేసులు వెలుగు చూస్తున్నాయన్నారు. అదనపు ఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో ఏడు శక్తి టీమ్‌లు పనిచేస్తున్నాయని, కళాశాలల సమయాల్లో మఫ్టీలో విధులు నిర్వహిస్తూ ఆక తాయిల వేధింపులను అరికడుతున్నామన్నారు. సైబర్ నేరాల నివారణ కోసం 1930 కాల్ సెంటర్ ను, గంజాయి, మాదక ద్రవ్యాల సమస్యల పరిష్కారానికి 1972 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిశోర్, సైబర్ క్రైమ్ ఎస్సై అయ్యప్ప రెడ్డి, జిల్లా మహిళ, శిశు సంక్షేమ అధికారి టి.శ్రీదేవి, సీఐ మంగాదేవి పాల్గొన్నారు.