
గోదావరి ఉరకలు
● ధవళేశ్వరంలో
మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
● అప్రమత్తమైన ఇరిగేషన్ యంత్రాంగం
ధవళేశ్వరం: ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉరకలెత్తుతోంది. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్దకు భారీగా నీరు చేరుతోంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 175 గేట్లను పైకి లేపి మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా కురస్తున్న వర్షాలతో గోదావరి ఉప నదులైన మంజీర, ఇంద్రావతి, శబరి పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటిని కిందకు వదులుతున్నారు. ఆ ప్రభావంతో కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి శనివారం క్రమేపీ పెరిగింది. ఉదయం 10.30 అడుగులు ఉన్న నీటి మట్టం రాత్రి 8.35 గంటలకు 11.75 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరంలో మొదటి ప్రమాద హెచ్చరికను ప్రకటించారు. అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు ధవళేశ్వరం ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో నీటి ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో ఆదివారం కూడా మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో గోదావరిలో పడవల రాకపోకలను నిషేదించారు. శనివారం రాత్రి 9 గంటలకు బ్యారేజీ వద్ద నీటిమట్టం 11.80 అడుగులకు చేరింది. 10,01,410 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాలువలకు 11,700 క్యూసెక్కులు విడిచిపెట్టారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 12.56, పేరూరులో 16.76, దుమ్ముగూడెంలో 12.90, కూనవరంలో 18.97, కుంటలో 10.20, పోలవరంలో 12.22, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి 15.85 మీటర్లు, భద్రాచలంలో 47.70 అడుగుల నీటి మట్టాలు కొనసాగుతన్నాయి.