
తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీ
మూడు వర్గాలుగా విడిపోయిన నేతలు
రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి వైపు లోకేష్ మొగ్గు?
దాదాపుగా ఖాయమన్న సంకేతాలు
టీడీపీ సీనియర్ నేత గన్నికి నిరాశేనా?
మరో నేత ముళ్లపూడి బాపిరాజు పేరు కూడా తెర పైకి..
సాక్షి, రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష పదవి ఉత్కంఠను రేపుతోంది. పదవి ఎవరిని వరిస్తుందా..? అన్న మీమాంస నేతల్లో నెలకొంది. ప్రధానంగా ముగ్గురు నేతల పేర్లు ప్రముఖంగా చర్చకు వచ్చాయి. వారిలో ఒకరికి ఖాయమన్న సంకేతాలు ఇప్పటికే పార్టీ శ్రేణులకు అందాయి. పదవి దక్కించుకునేందుకు ఎవరి స్థాయిలో వారు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఇందు కోసం మూడు వర్గాలుగా విడిపోయి మరీ అధిష్టానం, త్రిసభ్య కమిటీపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే చినబాబు లోకేష్ ఆశీస్సులు ఓ నేతకు ఉండటం, ఆయన ప్రకటన లాంఛనం కానున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.
జిల్లా అధ్యక్షుడి ఎంపికకు కసరత్తు
తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా కేఎస్ జవహర్ వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి దక్కడంతో టీడీపీ జిల్లా అధ్యక్షుడి మార్పు అనివార్యమైంది. దీనికితోడు జిల్లా కమిటీల ఏర్పాటుకు టీడీపీ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కమిటీల ఎంపిక కోసం ప్రత్యేకంగా ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జిల్లాలోని నేతలతో మాట్లాడి మెజారీటీ నేతల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని పేర్లను అధిష్టానానికి అందిస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల బూరుగుపూడిలోని టీడీపీ కార్యాలయంలో జిల్లా త్రిసభ్య కమిటీ సభ్యులు మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, ముక్కు ఉగ్రనరసింహారెడ్డిలు జిల్లాలోని ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలతో పాటు నియోజకవర్గానికి చెందిన సుమారు 10 మంది ప్రత్యేక ఆహ్వానితుల అభిప్రాయాలు సేకరించారు. ప్రత్యేక గదిలో కూర్చుని అభిప్రాయాలను తీసుకున్నారు. ఇందులో ఎవరి అభిప్రాయాలు వారు త్రిసభ్య కమిటీ ముందు ఉంచినట్లు తెలిసింది.
జిల్లా అధ్యక్షుడిగా వెంకటరమణ చౌదరి?
జిల్లా అధ్యక్షుడి ఎంపిక కోసం త్రిసభ్య కమిటీ సేకరించిన అభిప్రాయాల్లో అత్యధిక శాతం మంది రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది. సింహభాగం ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలు, ప్రత్యేక ఆహ్వానితులు సైతం వెంకటరమణ చౌదరి అభ్యర్థిత్వాన్నే బలపర్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికితోడు చినబాబు, మంత్రి లోకేష్ అండదండలు, ఆశీర్వాదం సైతం ఆయనకే ఉండటంతో అధ్యక్ష పదవి ఎంపిక లాంఛనం కానుందన్న అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
ఇదే విషయాన్ని త్రిసభ్య కమిటీ సభ్యులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. త్వరలోనే అధికారికంగా పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
గన్నికి మళ్లీ భంగపాటు?
టీడీపీ సీనియర్ నేత గన్నికృష్ణకు ఈ సారి కూడా భంగపాటు ఎదురుకానుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది పార్టీ శ్రేణుల నుంచి. ఇప్పటికే రాజమహేంద్రవం మేయర్ స్థానాన్ని గన్నికృష్ణ ఆశించారు. అయితే కార్పొరేషన్‌కు ఇప్పట్లో ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించకపోవడంతో మేయర్ స్థానం ఆశలు సైతం అడియాసలుగానే మిగిలిపోయాయి. ఈ విషయమై నేరుగా సీఎం చంద్రబాబుతోనే ఆ సీనియర్ నేత భేటీ అయ్యారని వినికిడి. అయినా లాభం లేకుండా పోయింది. కనీసం నామినేటెడ్ పదవైనా వరిస్తుందని అనుకున్నా.. అది కూడా దక్కలేదు. జిల్లా అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలన్న ప్రతిపాదన ఆయన వర్గం నేతలు త్రిసభ్య కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. సీనియర్ నేత కావడంతో పదవి దక్కుతుందన్న భావనలో ఆయన వర్గం నేతలు ఉన్నారు. కానీ అధిష్టానం మాత్రం వెంకటరమణ చౌదరి వైపు మొగ్గు చూపుతుండటంతో మళ్లీ నిరాశే ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన వర్గం గుర్రుగా ఉంది. సీనియర్ నేతను పక్కన పెడుతున్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది.
ముళ్లపూడి బాపిరాజుకూ అదే పరిస్థితా?
టీడీపీలో సీనియర్ నేత ముళ్లపూడి బాపిరాజు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్‌గా ఒక వెలుగు వెలిగిన నేత అయినా టీడీపీలో ప్రాధాన్యం కరవైందన్న ఆరోపణలున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేశారు. కూటమి అధికారంలోకి వచ్చింది. నామినేటెడ్ పదవైనా దక్కుతుందని భావించారు. మూడు దశల నామినేటెడ్ పదవుల భర్తీలో ఆయనకు స్థానం దక్కలేదు. ప్రస్తుతం జిల్లా అధ్యక్ష పదవైనా ఇవ్వాలంటూ ఆయన వర్గీయులు త్రిసభ్య కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆయనను మళ్లీ పక్కన పెడుతుండటంతో ఆయన వర్గీయులు అధిష్టానంపై లోలోపల మండిపడుతున్నట్లు తెలిసింది. దీనికితోడు బాపిరాజు గోపాలపురం నియోజకవర్గానికి చెందిన నేత కావడం, జిల్లాల పునర్విభజనలో గోపాలపురం నియోజకవర్గం ఏలూరు జిల్లాలోకి కలవనుండటంతో సైతం పదవికి అనర్హత సాధించినట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.