
గోదావరి పరవళ్లు
కాటన్ బ్యారేజీ నుంచి 7.88 లక్షల
క్యూసెక్కుల మిగులు జలాల విడుదల
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 10.30 అడుగులకు నీటి మట్టం చేరింది. బ్యారేజీ నుంచి 7,88,938 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. అనంతరం స్వల్పంగా తగ్గి రాత్రి 10 అడుగులకు చేరింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి ముందుగా ప్రకటించిన విధంగా నీటిని దిగువకు విడుదల చేయకపోవడంతో కాటన్ బ్యారేజీ వద్ద ప్రమాద స్థాయికి నీటి మట్టం చేరలేదు. అయితే శుక్రవారం రాత్రి ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టాలు క్రమేపి పెరుగుతుండటంతో శనివారం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి డెల్టా కాలువలకు 6,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 3,500, మధ్య డెల్టాకు 700, పశ్చిమ డెల్టాకు 2,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 12.33 మీటర్లు, పేరూరులో 16.65 మీటర్లు, దుమ్ముగూడెంలో 11.63 మీటర్లు, భద్రాచలంలో 42.90 అడుగులు, కూనవరంలో 17.01 మీటర్లు, కుంటలో 9.85 మీటర్లు, పోలవరంలో 11.31 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.40 మీటర్లు నీటి మట్టాలు కొనసాగుతున్నాయి.
కాటన్ బ్యారేజీ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి