
పొగాకు నారుమడికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి
– బోర్డు అధికారి హేమస్మిత
దేవరపల్లి: పొగాకు నారుమడులు కట్టే ముందు రైతులు తప్పనిసరిగా బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం నిర్వహణాధికారి సీహెచ్ హేమస్మిత రైతులకు సూచించారు. రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు పొగాకు వేలం కేంద్రాల పరిధిలో కట్టిన పొగాకు నారుమడులను పరిశీలించి, రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఈ ఏడాది పొగాకు బోర్డు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బోర్డు క్షేత్రస్థాయి అధికారి కీర్తికుమార్ ఆధ్వర్యంలో బృందం పనిచేస్తుందన్నారు. నారుమడులను పరిశీలించి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను తనిఖీ చేస్తారని ఆమె చెప్పారు. బృందం శుక్రవారం దేవరపల్లి వేలం కేంద్రం పరిధిలోని పల్లంట్లలో యలమాటి సుధాకర్ పొగాకు నర్సరీలను తనిఖీ చేసినట్టు ఆమె చెప్పారు. రిజిస్ట్రేషన్ లేకుండా నారుమడులు కడితే చర్యలు తీసుకొంటామన్నారు. రిజిస్ట్రేషన్ గల నారుమడుల్లోనే రైతులు నారు కొనుగోలు చేయాలని, నారు కొనుగోలు చేసిన నారుమడి రైతు ఇచ్చిన రశీదును నాట్లు వేసే సమయంలో మొక్కఫారంతో పాటు జత చేసి వేలం కేంద్రంలో అందజేయాలన్నారు. రిజిస్ట్రేషన్ లేని నారుమడుల నుంచి నారు కొనుగోలు చేస్తే పొగాకు బ్యారన్ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని తెలిపారు. 2025–26 పంట కాలానికి రాష్ట్రంలో 142 మిలియన్ల పొగాకు ఉత్పత్తికి అనుమతి ఇచ్చిందన్నారు.వేలం కేంద్రం పరిధిలో ఇప్పటి వరకు 96 మంది రైతులు నారుమడులను రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు తెలిపారు. వీరంతా నారు వ్యాపారస్తులేనని చెప్పారు.