
దొంగతనం కేసులో ఇద్దరి అరెస్టు
ప్రత్తిపాడు: దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను ప్రత్తిపాడు పోలీసులు గురువారం అరెస్టు చేసి సుమారు రూ.6.30 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజు గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మండలంలోని ధర్మవరం జగనన్న కాలనీలో నివసిస్తున్న గాలి తలుపులయ్య ఈనెల 21వ తేదీన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన ఇద్దరు ఆగంతకులు ఆ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. సీఐ బి.సూర్యఅప్పారావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. స్థానిక జాతీయ రహదారిపై గల శ్రీపాదాలమ్మ అమ్మవారి ఆలయం సమీపాన సాయంత్రం 4 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. రాజమహేంద్రవరం క్వారీపేటసెంటర్‌కు చెందిన కొవ్వూరి సునీల్, రాజమహేంద్రవరం రూరల్ మండలం తొర్రేడు గ్రామానికి చెందిన బాలుడిని అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టారు. నిందితుల నుంచి సుమారు రూ.6.30 లక్షల విలువైన 247 గ్రాముల బంగారు గొలుసులు, గాజులు, ఉంగరాలు తదితరాలు, 90 గ్రాముల వెండి వస్తువులు, 3 గ్రాముల ప్లాటినం ఉంగరం స్వాధీనం చేసుకున్నారు. కాగా బాలుడిపై నాలుగు మోటారు బైక్ దొంగతనం కేసులున్నాయన్నారు. వీరు చోరీ చేసేందుకు రాజమహేంద్రవరంలో గంటకు రూ.200 వంతున యమహా ఆర్‌ఒన్ 5 బైక్ అద్దెకు తీసుకుని రూ.1,800 చెల్లించినట్టు పోలీసులు తెలిపారు. ఆ వాహనాన్ని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాల నేరస్తుడిని జూవైనల్ కోర్టులోనూ, నిందితుడిని ప్రత్తిపాడు కోర్టులోనూ హాజరుపరచనున్నట్టు ఆయన తెలిపారు.
సుమారు రూ.6.30 లక్షల విలువైన
చోరీ సొత్తు స్వాధీనం