
భారత్, తైవాన్‌లది బలమైన బంధం
టీఈసీసీ డైరెక్టర్ స్టీఫెన్ షు–చిహ్ హ్సు
రాజానగరం: భారత్, తైవాన్ దేశాలు ఆర్థిక, సాంకేతిక, రాజకీయ రంగాలలో బలమైన సంబంధాలను కలిగివుండటంతో ఇరు దేశాలు ఎగుమతి, దిగుమతులలో పురోగతిని సాధిస్తున్నాయని చైన్నెకు చెందిన టీఈసీసీ డైరెక్టర్ స్టీఫెన్ షు–చిహ్ హ్సు అన్నారు. స్థానిక గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జిజియు)లో గ్రీన్ ఎకానమీ, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ అండ్ గ్రీన్ టెక్నాలజీలలో కృత్రిమ మేధ (ఏఐ) అంశాలపై గురువారం అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. తైవాన్ నేషనల్ సన్ యాట్–సెన్ యూనివర్సిటీ, తైవాన్ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సహకారంతో జరిగిన ఈ సదస్సుకు చాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) అధ్యక్షత వహించారు. స్టీఫెన్ షు–చిహ్ హ్సు మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్ రంగంలో భారత్ నైపుణ్యం కలిగివుంటే, సెమీ కండక్టర్ తయారీలో తైవాన్ ప్రత్యేక అనుభవంతో ఉందన్నారు. ఈ రెండు కలిస్తే అభివృద్ధిలో కొత్త ఒరవడిని తీసుకురావొచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సెమీ కండక్టర్ తయారీ హబ్‌కు ప్రభుత్వ ఆమోదం లభించిందన్నారు. దీని అభివృద్ధికి తైవాన్ సహకరిస్తుందన్నారు. ఈ రంగంలో విద్యార్థులు, అధ్యాపకులకు శిక్షణ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో సీటీఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ ఎం.శేషుమాధవ్, ప్రొ చాన్సలర్ కె.శశికిరణ్‌వర్మ, వీసీ డాక్టర్ యు.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.