
మళ్లీ పెరుగుతున్న గోదావరి ఉధృతి
● నేడు ధవళేశ్వరంలో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం
● అప్రమత్తమైన ఇరిగేషన్ యంత్రాంగం
ధవళేశ్వరం: గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద గోదావరి క్రమేపీ పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో నీటి ఉధృతి పెరుగుతుండటంతో ఆ ప్రభావం ధవళేశ్వరం వద్ద శుక్రవారం ఉదయం నుంచి కనిపించే అవకాశం ఉంది. శుక్రవారం రాత్రికి ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటిమట్టం చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ధవళేశ్వరం ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాటన్ బ్యారేజీ నుంచి గురువారం రాత్రి 5,15,938 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. గురువారం రాత్రి నీటి మట్టం 10.40 అడుగులకు చేరింది. స్థానికంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో డెల్టా కాలువలకు నీటి విడుదలను తగ్గించారు. గోదావరి డెల్టా కాలువలకు సంబంధించి 4,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 1,600, మధ్య డెల్టాకు 700, పశ్చిమ డెల్టాకు 2,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 9.34 మీటర్లు, పేరూరులో 13.42 మీటర్లు, దుమ్ముగూడెంలో 11.18 మీటర్లు, భద్రాచలంలో 38.60 అడుగులు, కూనవరంలో 16.73 మీటర్లు, కుంటలో 12.20 మీటర్లు, పోలవరంలో 10.90 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద 14.94 మీటర్ల నీటి మట్టాలు కొనసాగుతున్నాయి.