
హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
తాళ్లరేవు: మండలంలోని నీలపల్లిలో సోమవారం అర్ధరాత్రి జరిగిన హత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్థానిక చెక్ పోస్టు సమీపంలోని మురళీనగర్‌లో పాలెపు శ్రీను(48) హత్య సంఘటన స్థానికంగా కలకలం రేపింది. రాళ్లతో కొట్టి, మట్టిలో పూడ్చి అతిదారుణంగా హతమార్చడంతో.. ప్రశాంతంగా ఉండే నీలపల్లి గ్రామంలో స్థానికులు ఉలిక్కిపడ్డారు. మంగళవారం ఉదయం సంఘటన స్థలాన్ని కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ, కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ, రెవెన్యూ సిబ్బంది సందర్శించారు. యానాం ప్రాంతానికి చెందిన మృతుడి ప్రాణ స్నేహితుడు.. సెల్‌ఫోన్ విషయమై శ్రీనుతో తగాదా పెట్టుకుని ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో వాస్తవాలు నిర్ధారించేందుకు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చైతన్యకృష్ణ తెలిపారు. మృతదేహానికి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించి, మృతుడి బంధువులకు అప్పగించినట్టు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.