
రోడ్డు ప్రమాదంలో చిన్నా మృతి
అంబాజీపేట: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ మేడిది రంగ జానకీప్రసాద్ (చిన్న)(55) సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అమలాపురం రూరల్ మండలం పాలగుమ్మి ప్రధాన పంట కాలువలో మంగళవారం చిన్నా మృతదేహం తేలియాడుతుండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిన్న స్థానిక కొర్లపాటివారిపాలెంలో నివసిస్తున్నారు. సోమవారం రాత్రి మోటార్ బైక్ అదుపుతప్పడంతో రాకుర్తివారిపాలెం వద్ద పంట కాలువలో పడి మృతిచెందినట్టు చెబుతున్నారు. తండ్రి కాలం నుంచి కొబ్బరి వ్యాపారం, టీడీపీలో క్రియాశీలక సభ్యుడిగా, స్థానికంగా ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడిగా సేవలందించారు. వివాదరహితుడిగా అందరితో కలుపుగోలుగా ఉండేవారు. పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా పనిచేసిన సమయంలో ప్రధానమంత్రి మాతృత్వ సురక్షా యోజన కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పేరు పొందారు. కాగా చిన్నాకు భార్య పావనీరాణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ప్రస్తుతం అమెరికాలో ఎంఎస్ చదువుతున్నాడు. చిన్నా మరణ వార్తతో కొర్లపాటివారిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. పలువురు నాయకులు, కొబ్బరి వ్యాపారులు సంతాపం వ్యక్తం చేశారు.