
పువ్వులు, పండ్ల ధరకు రెక్కలు
పెరవలి: వినాయక చవితి సందర్భంగా మార్కెట్‌లో పూలు, పండ్ల ధరలకు రెక్కలు రావడంతో వినియోగదారులు హడలిపోతున్నారు. కాకరపర్రులోని హోల్‌సేల్ పూల మార్కెట్ మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులతో కళకళలాడింది. కిలో బంతి పూలు రూ.120 పలకగా చామంతి పూలు రకాన్ని బట్టి రూ.400 నుంచి రూ.600 వరకూ, కనకాంబరాలను రూ.600, మల్లెపూలు, సన్నజాజులను రూ.1500 విక్రయించారు. గులాబీలు ఒక్కొక్కటి రూ.5, చామంతి పువ్వు ఒక్కటి రూ.8 పలికింది. విడిగా మార్కెట్ మూర మల్లెపూలు, జాజులు రూ.100, కనకంబరాలు రూ.100 పలికాయి. చిల్లర వ్యాపారస్తులు ఈ ధరలను మరింత పెంచి అమ్మకాలు జరిపారు. ఇక పండ్ల రకాలలో ఆపిల్ ఒక్కటి రూ.30 నుంచి రూ.40, బత్తాయి రూ.20, నారింజ రూ.15, వెలగకాయ రూ.30, మారేడు రూ.20, మామిడి రూ.20, దానిమ్మ కాయలు రకాన్ని బట్టి రూ.30 నుంచి రూ.40 వరకు, పంపర పనస కాయ ఒకటి రూ.50 నుంచి రూ.80కు, కలువ పూలు రెండు రూ.10కు విక్రయించారు. పత్రి కట్ట రూ.25 నుంచి రూ.40 పలికింది.
ఎగువ ప్రాంతాల్లో
పెరుగుతున్న నీటి మట్టాలు
ధవళేశ్వరం: ఎగువ ప్రాంతాల్లో నీటిమట్టాలు పెరుగుతూ ఉండడంతో బుధవారం ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కాళేశ్వరంలో 7.29 మీటర్లు, పేరూరులో 11.51, దుమ్ముగూడెంలో 8.16, కూనవరంలో 12.19, కుంటలో 5.12, పోలవరంలో 8.52, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద 14.25 మీటర్లు, భద్రాచలంలో 26.60 అడుగుల నీటిమట్టాలు కొనసాగుతున్నాయి.