కదం తొక్కిన విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన విద్యార్థులు

Aug 26 2025 7:42 AM | Updated on Aug 26 2025 7:42 AM

కదం తొక్కిన విద్యార్థులు

కదం తొక్కిన విద్యార్థులు

గెంటివేసిన పోలీసులు

సమస్యల పరిష్కారం కోసం వస్తే

గెంటేస్తారా అని ఆందోళన

ప్రభుత్వ తీరుపై ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): విద్యార్థులు సమస్యలు చెప్పుకుందామని కలెక్టరేట్‌కు వస్తే పోలీసులు అడుగడుగునా జులుం చూపించారు. వందలాదిగా తరలివచ్చిన విద్యార్థులు కలెక్టరేట్‌ ప్రాంగణం బయట తమ డిమాండ్‌లను నేరవేర్చాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. అక్కడ ఉన్న విద్యార్థులను గెంటివేశారు. విద్యార్థులకు, పోలీసులకు మధ్య కొంత ఘర్ణణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఒక్కసారిగా విద్యార్థులను పక్కకు లాగివేయడంతో విద్యార్ధులు పోలీసులు డౌన్‌ డౌన్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒకపక్క విద్యార్ధులు, మరో వైపు పోలీసుల అరుపులు, కేకలతో కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సుమారు 1,000 మంది విద్యార్థులతో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. న్యాయమైన తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం వస్తే పోలీసులతో నెట్టివేయడం ఎంత వరకు సమంజసమని విద్యార్థులు ఆవేదన చెందారు. విద్యార్థి సంఘ నాయకులను చొక్కా పట్టుకొని లాగడమే కాకుండా దూరంగా లాక్కెళ్లిపోయారు.

ప్రభుత్వ కళాశాలలో ఫీజులు చెల్లించాలని హకుం

ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాకుండానే ముందస్తుగానే ఫీజులు కట్టమని వేధింపులకు గురిచేస్తున్నారని విద్యార్థులు ఆవేదన చెందారు. ప్రభుత్వం ఫీజు సొమ్ము తమ బ్యాంకు ఖాతాలకు వేయకుండానే ముందస్తుగా ప్రభుత్వ కళాశాలలో కట్టమని చెప్పటం దారుణమని వాపోయారు. తక్షణమే ముందస్తుగా ఫీజు కట్టించుకోవటం ఆపాలని డిమాండ్‌ చేశారు.

సమస్యలను వెంటనే పరిష్కరించాలి

కూటమి పాలనలో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కలెక్టరేట్‌ వధ్ద విద్యార్థులు నిర్వహించిన ధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎప్పటికప్పుడు జమ అయ్యేదని, దానితో వారి చదువులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగాయన్నారు. కాని నేడు కూటమి ప్రభుత్వ హయాంలో విద్యార్థులు న్యాయమైన డిమాండ్‌ల కోసం రోడ్లపైకి రావాలసి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరిచి తక్షణం విద్యార్థుల డిమాండ్‌లను నేరవేర్చాలన్నారు. లేని పక్షంలో విద్యార్థులతో కలిసి పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజాల బాబు పాల్గొన్నారు.

పరిష్కారానికి డీఆర్‌ఓ హామీ

డీఆర్‌ఓ సీతారామమూర్తి విద్యార్థుల దగ్గరికి వచ్చి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ ప్రశాంతికి తెలియజేస్తామని, కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతి పత్రం అందజేశారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్‌, జిల్లా కమిటీ సభ్యులు కె.జ్యోతిర్మయి, కనక, వాసు, సాహితి, నాగ చైతన్య, సురేష్‌ పాల్గొన్నారు.

డిమాండ్‌లు ఇవీ..

పెండింగులో ఉన్న 6,400 కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్‌ సొమ్ము విడుదల చేయాలని, అద్దె భవనాల్లో నడుస్తున్న హాస్టల్స్‌కి సొంత భవనాలు నిర్మించాలని, హాస్టల్‌ మరమ్మతులకు నిధులు కేటాయించాలని, మెస్‌ చార్జీలు రూ.3,000కి పెంచాలని, జీ.ఓ నెంబర్‌ 77 రద్దు చేసి పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రంగంపేటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, కొవ్వూరు డిగ్రీ కళాశాలకు నిధులు కేటాయించాలని, ఆదికవి నన్నయ యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్సు డిపార్ట్‌మెంట్‌లో అధ్యాపకులు లేరని, తక్షణం వారిని నియమించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై.భాస్కర్‌, ఎన్‌.రాజా డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement