
కూటమిలో కుంపటి
రాజమహేంద్రవరం రూరల్: కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్న కూటమి పార్టీల డొల్లతనం బయటపడింది. పేరుకి స్నేహగీతం ఆలపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కూటమి నాయకుల్లో అలుముకున్న అసంతృప్తి సహకార సొసైటీ త్రీమెన్‌న్‌కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం వేదికగా వెల్లడైంది. రూరల్ మండలంలో రెండురోజులుగా ఐదు సొసైటీల ప్రమాణ స్వీకారోత్సవాలు జరిగాయి. వీటిని కూటమిలోని జనసేన, బీజేపీలు బహిష్కరించడం ద్వారా తమ అసంతృప్తిని వెల్లడించాయి. కడియం మండలంలో మాదిరిగానే పదవులు పొందిన కూటమిలోని నాయకులను ఆకట్టుకోవడం ద్వారా అసంతృప్తి బయట పడకుండా గట్టెక్కేద్దాం అనుకున్న టీడీపీ నాయకులకు ఇతర పార్టీల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో కంగుతిన్నారు. రూరల్ మండలంలో ప్రకటించిన ఐదు సొసైటీల త్రీమెన్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవాలకు జనసేన, బీజేపీ కీలక నాయకులను ఆహ్వానించకుండా రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ఒక్కరే ఒంటి చేత్తో కార్యక్రమాలను నిర్వహించేద్దాం అనుకున్నారు. కానీ బుచ్చయ్య మార్కు రాజకీయాన్ని గుర్తించిన రూరల్ జనసేన, బీజేపీ నాయకులు మొత్తం ఆ కార్యక్రమాలను బహిష్కరించి తమ పట్టుదలను ప్రదర్శించారు. తాజాగా సోమవారం జరిగిన హకుంపేట సొసైటీ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి కమిటీలో సభ్యుడైన జనసేనకు చెందిన సొము వినాయక్ డుమ్మా కొట్టారు. రూరల్ మండలంలో ఐదు సొసైటీల్లో తమ పార్టీ తరఫున కనీసం ఒక్క డైరెక్టర్‌ను నియమించకపోవడంతో బీజేపీ గోరంట్లపై తీవ్ర అసంతృప్తితో ఉంది. కూటమిగా కొనసాగుదామని నిర్ణయించుకున్నాక ప్రతి కార్యక్రమంలోను తమ నాయకులకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు పట్టుబడుతున్నారు. అలా చేస్తే తన రాజకీయ మనుగడకు ముప్పు వస్తుందన్న అనుమానంతో ఉన్న బుచ్చయ్యచౌదరి వారికి ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. వాస్తవానికి మంత్రి దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజులకు తగినంత సమయం ఉన్నప్పటికీ వాళ్లను ఆహ్వానించకుండా తనదే పైచేయిగా వ్యవహరిస్తున్న బుచ్చయ్య ఒంటెత్తు పోకడలను భవిష్యత్తుల్లో సాగనీయబోమని కూటమి నేతలు అంటున్నారు. దీంతో భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు ఏ దిశగా సాగనున్నాయన్న చర్చ కూటమి నేతల మధ్య నడుస్తోంది.
బుచ్చయ్య రాజకీయాన్ని తప్పుబడుతున్న నేతలు
సొసైటీ త్రీమెన్ కమిటీ ప్రమాణ
స్వీకారోత్సవాన్ని బహిష్కరించిన
జనసేన, బీజేపీ