
ఆసరాకు ఎసరు
చిత్రంలోని మానసిక దివ్యాంగ చిన్నారి పేరు గండ్రేటి చంద్రిక. వయసు 12 ఏళ్లు. రాజమహేంద్రవరంలో నివాసం ఉంటున్నారు. మానసిక వైకల్యం 90 శాతం ఉన్నట్లు వైద్యులు ధృవీకరణ పత్రం ఇచ్చారు. పింఛను రూ.6 వేలు అందుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రీ వెరిఫికేషన్‌లో 100 శాతం వైకల్యం ఉన్నట్టు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ ప్రస్తుతం పింఛను ఆపేయడంతో చిన్నారి తల్లి ఆవేదన చెందుతోంది. ఒక్కసారిగా పింఛను ఎందుకు ఆపేశారంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తమకున్న ఆర్థిక భరోసా తీసేశారంటూ వాపోతోంది.
ఎవరూ పని ఇవ్వడం లేదు
రాజమహేంద్రవరం నగరం 17వ వార్డుకు చెందిన లద్దిక సునీత దివ్యాంగురాలు. భర్త మృతి చెందారు. అగ్ని ప్రమాదంలో ముఖం కింది భాగం పూర్తిగా కాలిపోయింది. 2010లో 65 శాతం వైకల్యంతో పింఛను మంజూరు చేశారు. అప్పటి నుంచి పింఛను డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటోంది. ప్రస్తుతం రీ వెరిఫికేషన్‌లో వైకల్య శాతం 40కు తగ్గించారు. దీంతో పింఛను పోయింది. తన ఆకారాన్ని చూసి ఎవరూ పని ఇవ్వడం లేదని, వచ్చే పింఛను డబ్బుతో బతికేదాన్నని.. అది కూడా లేకుండా చేశారంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇప్పుడు తాను ఎలా బతకాలని ఆవేదన చెందుతోంది.

ఆసరాకు ఎసరు