
ముగిసిన ఆలిండియా చదరంగం పోటీలు
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): ఆలిండియా ఇండిపెండెన్స్ డే కప్ చదరంగం పోటీలు రాజమహేంద్రవరంలో విజయవంతంగా ముగిశాయి. ఈ జాతీయ స్థాయి పోటీలను స్థానిక లారెల్ హై గ్లోబల్ స్కూల్‌లో క్యాల్ఫ్యూషన్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏపీ చెస్ అసోసియేషన్ సౌజన్యంతో నిర్వహించారు.
309 మంది క్రీడాకారులు పాల్గొన్నట్టు టోర్నమెంట్ డైరెక్టర్ విత్తనాల హైమావతి సోమవారం తెలిపారు. విజేతగా రాఘవ శ్రీవాత్సవ్ (హైదరాబాద్), రన్నరప్‌గా జ్ఞానసాయి సంతోష్(కాకినాడ), మూడో స్థానంలో దివ్యతేజ (కాకినాడ) నిలిచారు. ఏడు రౌండ్ల పోటీలను స్విస్ పద్ధతిలో జరిగాయి. రాఘవ శ్రీవాత్సవ్ చాంపియన్‌షిప్ ట్రోఫీతో రూ.25 వేల నగదు, జ్ఞానసాయి సంతోష్ రూ.10 వేలు, దివ్యతేజ రూ.5 వేల నగదు బహుమతులను అందుకున్నారు. ముఖ్యఅతిథిగా ఏపీ చెస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వై.సుమన్,, స్కూల్ ప్రిన్సిపాల్ ఏక్తా, టోర్నమెంట్ కన్వీనర్ పూర్ణచంద్ర శర్మ, విత్తనాలు కుమార్ తదితరులు పాల్గొన్నారు.