
ప్రజల్లోకి కూటమి మోసాలు
క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో
‘రీకాలింగ్ మేనిఫెస్టో’
రాజమహేంద్రవరం రూరల్: కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రెవ.విజయ సారథి అన్నారు. సోమవారం రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరులోని ఓ ఫంక్షన్ హాల్‌లో క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ‘రీకాలింగ్ మేనిఫెస్టో’ సమావేశం నిర్వహించారు. ఏడు నియోజకవర్గాల క్రిస్టియన్ మైనార్టీ సెల్ నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమయంలో అలవిగాని హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను దగా చేస్తోందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాబు మోసాలను గ్రామ స్థాయిలోకి తీసుకెళ్తామన్నారు. కూటమి ప్రభుత్వంపై క్రైస్తవులు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్, రాజనగరం అధ్యక్షులు రెవ జొనాతన్, అనపర్తి అధ్యక్షులు రెవ దావీదు, నాయకులు రెవ.సుధాకర్, రెవ. చిట్టి బాబు, బ్రదర్ శామ్యూల్, బ్రదర్ ఐజియా, పాస్టర్ జాన్ బాబు పాల్గొన్నారు.
కొబ్బరిచెట్లను మింగేస్తున్న గోదావరి
మామిడికుదురు: ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న నీటితో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంతో వైనతేయ తీరంలో కొబ్బరి చెట్లు కూలిపోతున్నాయి. రెండు రోజుల నుంచి వరద ప్రవాహం తీవ్రంగా ఉంది. సుడులు తిరుగుతున్న నీటి ఉధృతికి కొబ్బరి చెట్లు అమాంతంగా నదిలో కూలిపోతున్నాయి. అప్పనపల్లి పాటు రేవు సమీపంలో కొబ్బరి చెట్లతో పాటు సారవంతమైన భూమి నదిలో కలిసిపోయింది. పెదపట్నం, బి.దొడ్డవరం, పెదపట్నంలంక, పాశర్లపూడి గ్రామాల్లో సైతం పరిస్థితి నెలకొంది.