
ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో చేనేత ప్రదర్శన
● పీజీఆర్‌ఎస్‌లో 238 అర్జీల స్వీకరణ
● కలెక్టర్ ప్రశాంతి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రభుత్వ రంగ హస్తకళల అభివృద్ధి సంస్థ ‘‘ఆప్కో’’ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రత్యేక వస్త్రాల స్టాల్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఆప్కో స్టాల్‌ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత పరిశ్రమను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రజలకు 30 శాతం రిబేట్‌పై ఆప్కో చేనేత వస్త్రాలు అందుబాటులో ఉంచామన్నారు. చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను వినియోగించటం ద్వారా వారికి మెరుగైన జీవనోపాధి కల్పించవచ్చని, ప్రతి ఒక్కరూ వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలను ధరించాలన్నారు. ప్రతి శనివారం ప్రభుత్వ ఉద్యోగులు ఆప్కో చేనేత వస్త్రాలు ధరించేలా చర్యలు తీసుకోవాలని, జిల్లా ప్రజలు చేనేతను ప్రోత్సహిస్తూ ఆప్కో వస్త్రాల కొనుగోలును ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 238 అర్జీలను స్వీకరించామన్నారు. అర్జీదారునికి నాణ్యతతో కూడిన పరిష్కారం చూపించాలన్నారు.
ఐటీఐలో రెండో విడత
ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
రాజమహేంద్రవరం రూరల్: పదవ తరగతి ఉత్తీర్ణులైన, ఇంటర్మీడియెట్ ఫెయిల్ అయిన అభ్యర్థులకు ఐటీఐలలో ప్రవేశం కోసం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో 2025– 26 సంవత్సరానికి రెండవ విడత అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ సీహెచ్ సునీల్‌కుమార్ తెలిపారు. అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలతో ‘ఐటీఐ.ఏపీ.జీవోవీ.ఇన్’ వెబ్‌సైట్ ద్వారా 20వ తేదీ రాత్రి 11.55 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 22వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తారన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక జత జిరాక్స్‌లతో హాజరై వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. వివరాలకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఐటీఐ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.
క్వాంటం టెక్నాలజీ
ఎఫ్‌డీపీ ప్రారంభం
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ క్యాంపస్‌లోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో క్వాంటం టెక్నాలజీపై ఏఐసీటీఈ – ఏటీఏఎల్ స్పాన్సర్డ్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎఫ్‌డీపీ) సోమవారం ప్రారంభమైంది. క్వాంటం టెక్నాలజీల రంగాన్ని అన్వేషించడమే లక్ష్యంగా ఇండియన్ ఇన్సిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్సిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) ల ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ అన్నారు. సమకాలీన విద్య, పారిశ్రామిక దృశ్యంలో క్వాంటం టెక్నాలజీల ఔచిత్యాన్ని వివరించారు. ఎఫ్‌డీపీ కన్వీనర్ డాక్టర్ వి. పెర్సిస్ మాట్లాడుతూ 50 మంది వరకు ఫ్యాకల్డీ సభ్యులు హాజరైన ఈ కార్యక్రమం ఈ నెల 19 వరకు జరుగుతుందన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వెంకటేశ్వర్రావు, కో కన్వీనర్ డాక్టర్ జి. కీర్తి మరిట, సీఎస్‌ఈ హెచ్‌ఓడి డాక్టర్ బి.కెజియయారాణి పాల్గొన్నారు.
పోలీసు పీజీఆర్‌ఎస్‌కు
36 ఫిర్యాదులు
రాజమహేంద్రవరం రూరల్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘‘పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం’’(పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమానికి 36 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డి.నరసింహకిషోర్ ఆదేశాలు మేరకు అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) ఎన్. బి.ఎం మురళీకృష్ణ, అడిషనల్ ఎస్పీ (లా అండ్ ఆర్డర్) ఏ.వీ సుబ్బరాజు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ రకాల అర్జీలను స్వీకరించారు. సివిల్ కేసులు, కుటుంబ సమస్యల గురించి, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు.

ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో చేనేత ప్రదర్శన