
పప్పుతిప్పలు
గిట్టుబాటు కావడంలేదు
రెండు నెలలుగా మార్కెట్లో పప్పునకు డిమాండ్ తగ్గింది. ఎగుమతులు నిలిచిపోయాయి. ప్రస్తుత ధర గిట్టుబాటుగా లేదు. మూఢానికి ముందు కిలో పప్పు రూ.800 పలకడంతో వ్యాపారం బాగుంది.
– సుతాపల్లి వెంకన్నబాబు, అధ్యక్షుడు,
శ్రీవేంకటేశ్వర, క్యాజూ మర్చంట్స్
అసోసియేషన్, దేవరపల్లి
నాణ్యత తగ్గింది
వర్షాలకు తడవడంతో జీడిగింజలు నల్లబడి పప్పు నాణ్యత తగ్గింది. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న గింజల పప్పు నాణ్యత బాగుంది. విదేశీ గింజలు బస్తాకు 21 కిలోలు పప్పు దిగుబడి వస్తుండగా, స్వదేశీ గింజలు దిగుబడి 24 నుంచి 25 కిలోలు వస్తోంది. గింజల ధర ఒకే విధంగా ఉన్నాయి. మెట్ట ప్రాంతంలో సుమారు 90 పరిశ్రమలు ఉండగా, దాదాపు 500 మంది వ్యాపారులు ఉన్నారు. మూతబడిన పరిశ్రమలను తెరచి కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఆలోచన చేస్తున్నాం.
– పెంజర్ల గణేష్‌కుమార్,
జీడిపప్పు వ్యాపారి, దేవరపల్లి
జీడిపప్పును
ప్యాకింగ్ చేస్తున్న మహిళలు
● జీడిపప్పు పరిశ్రమకు ఆషాఢం ఎఫెక్ట్
● రెండు వారాలుగా మూతబడిన వైనం
● మార్కెట్లో తగ్గిన డిమాండ్
● గింజల బస్తా ధర రూ.12,500
● పప్పు ధర కిలో రూ.700
● గిట్టుబాటు కాదంటున్న రైతులు
● మెట్ట ప్రాంతంలో 90 పరిశ్రమలు
దేవరపల్లి: జీడిపప్పు పరిశ్రమపై మూఢం, ఆషాఢం ఎఫెక్ట్ పడింది. ఆషాఢ మాసానికి ముందు నెల రోజులు మూఢం రావడంతో ముహూర్తాలు లేక జీడిపప్పునకు మార్కెట్లో డిమాండ్ తగ్గిందని వ్యాపారులు వాపోతున్నారు. మార్కెట్లో వినియోగం తగ్గడంతో పప్పు ధర తగ్గింది. మూఢానికి ముందు కిలో పప్పు ధర రూ.800 ఉండగా, ఆషాఢం ప్రారంభం నుంచి తగ్గుముఖం పట్టి ప్రస్తుతం రూ.700 నుంచి రూ.720 పలుకుతోంది. గింజల ధర బస్తా(80 కిలోలు) రూ.12,000 నుంచి 12,500 ఉండడంతో వ్యాపారులకు నష్టం వస్తోంది. బస్తా గింజలకు 24 నుంచి 25 కిలోల పప్పు తయారవుతుంది. కిలో పప్పు తయారు కావడానికి గింజల ధర రూ.690, ఖర్చులు రూ.20 అవుతాయి. అంటే కిలో పప్పు తయారు కావడానికి రూ.710 ఖర్చు అవుతుండగా, ఆదాయం రూ.700 వస్తోంది. దీనిని బట్టి కిలోకు రూ.10 నుంచి రూ.20 నష్టం వస్తోంది.
మెట్ట ప్రాంతంలో విస్తరణ
తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు డివిజన్ పరిధిలోని నిడదవోలు మండలం తాడిమళ్ల, చాగల్లు మండలం చిక్కాల, దేవరపల్లి మండలం దేవరపల్లి, నల్లజర్ల మండలం దూబచర్ల, గోపాలపురం మండలం గోపాలపురంలో జీడిపప్పు పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. తాడిమళ్ల, దేవరపల్లి కేంద్రంగా జీడిపప్పు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి జరుగుతుంది. తాడిమళ్లలో సుమారు 45 పరిశ్రమలు, దేవరపల్లిలో 15 పరిశ్రమలు, చిక్కాలలో 5 పరిశ్రమలు, దూబచర్లలో 15 పరిశ్రమలు , గోపాలపురంలో 10 పరిశ్రమలు ఉన్నాయి. ఎక్కువ ఉత్పత్తి తాడిమళ్ల, దేవరపలి, దూబచర్ల నుంచి జరుగుతుంది. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన అధునాతన యంత్రాలను తీసుకు వచ్చి వ్యాపారులు జీడిపప్పు తయారీ పరిశ్రమలను నెలకొల్పారు.
కార్మికుల ఉపాధికి గండి
మార్కెట్లో జీడిపప్పునకు డిమాండ్ లేకపోవడం, గింజల ధర పెరగడంతో జీడిపప్పు కొనేనాథుడు కరువయ్యాడని వ్యాపారులు వాపోతున్నారు. తయారు చేసిన పప్పు నిల్వలు మిల్లుల వద్ద పేరుకుపోవడంతో అమ్మకాలు లేక రెండు వారాల నుంచి దేవరపల్లిలోని పరిశ్రమలకు యజమానులు సెలవు ప్రకటించి మూసి వేశారు. మండలంలోని 15 పరిశ్రమలు మూతబడడంతో పప్పు తయారీ నిలిచిపోయింది.
శ్రావణమాసంపైనే ఆశలు
ఆషాఢం అనంతరం ఈ నెల 27 నుంచి వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభముహూర్తాలు ఉండడంతో పప్పునకు డిమాండ్ పెరగవచ్చునని వ్యాపారులు ఆశిస్తున్నారు. ఏటా ఆషాఢంలో పప్పు ధర తగ్గగా, శ్రావణంలో ధర పెరుగుతుంది.

పప్పుతిప్పలు

పప్పుతిప్పలు

పప్పుతిప్పలు

పప్పుతిప్పలు