
ఖరీఫ్‌కు నీటి కష్టం
జిల్లాలో నాట్లు పరిశీలిస్తే...
వరి సాధారణ నాట్లు
మండలం సాగు విస్తీర్ణం (హెక్టార్లలో)
(హెక్టార్లలో)
రాజమహేంద్రవరం 1,460 716
కడియం 2,137 1,875
రాజానగరం 4,687 1,286
అనపర్తి 3,739 2,874
బిక్కవోలు 6,113 2,430
కోరుకొండ 5,755 230
సీతానగరం 5,710 1,530
రంగంపేట 2,815 240
చాగల్లు 3,421 2,712
దేవరపల్లి 3,657 2,310
గోపాలపురం 4,216 595
కొవ్వూరు 4,507 4,210
నిడదవోలు 7,253 4,830
తాళ్లపూడి 3,787 1,214
ఉండ్రాజవరం 4,923 1,892
నల్లజర్ల 4,247 2,180
● రుతు పవనాల దాగుడుమూతలు
● కరుణించని వరుణుడు
● వర్షాభావ పరిస్థితులతో
మెట్ట రైతులకు ఇబ్బందులు
● జిల్లాలో వరి నాట్లకు
శ్రీకారం చుట్టిన రైతులు
● సకాలంలో వర్షం కురవకపోవడంతో ఆలస్యంగా సాగుతున్న ప్రక్రియ
● గతేడాది ఈ సమయానికి విస్తారంగా వర్షాలు, గోదావరికి వరదలు
సాక్షి, రాజమహేంద్రవరం: రుతుపవనాలు దాగుడుమూతలు ఆడుతున్నాయి. వరుణుడు కరుణించడం లేదు. వెరసి ఖరీఫ్ రైతుకు కన్నీటి కష్టం తప్పడం లేదు. గోదావరి చెంతనే ఉన్నా.. మెట్ట గ్రామాల్లో మాత్రం సాగునీటి కొరత వేధిస్తోంది. ఫలితంగా నాట్ల ప్రక్రియ ఆలస్యంగా సాగుతోంది. నైరుతి రుతుపవనాలు జూన్ నెల మొదటి వారంలో పలకరించనున్నట్లు వాతావరణ శాఖ అప్పట్లో సంకేతాలు వెలువరించింది. జూలై 10వ తేదీ నాటికి రాష్ట్రమంతా విస్తరించనున్నట్లు ఆ శాఖ అంచనా వేసింది. కానీ పరిస్థితి అందుకు విరుద్ధంగా సాగింది. ఎండలు ఉండాల్సిన సమయంలో అకాల వర్షాలు కురవగా తొలకరి సమయంలో వర్షాలు ముఖం చాటేశాయి. వెరసి నాట్లు వేసిన రైతులకు నీటిపాట్లు తప్పడం లేదు. ఈ సమయానికే నాట్లు పూర్తి కావాల్సి ఉన్నా.. 50 శాతం మాత్రమే పూర్తయ్యాయి.
ఆగిన రుతుపవనాల కదలిక
ఖరీఫ్ సాగుకు రుతుపవనాలు సకాలంలో రానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకున్నారు. ఒక్కసారిగా రుతుపవనాల కదలిక ఆగిపోయింది. ఫలితంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. జూన్ నెల 19వ తేదీ వరకు తీవ్రమైన ఎండలు, వేడిగాలులు వీచాయి. ఉక్కపోతతో ప్రజల అల్లాడిపోయారు. దీంతో సాగుకు కర్షకులు వెనకడుగు వేశారు. ప్రస్తుతం సాగుకు వర్షాల అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వరుణుడు కరుణించడం లేదు. ఫలితంగా నాట్ల ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఇప్పటికే పూర్తవ్వాల్సి ఉండగా.. ఇంకా సాగుతూనే ఉంది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 3,848 హెక్టార్లలో నారుమళ్లకు అవకాశముండగా.. సోమవారం నాటికి వంద శాతం పూర్తయినట్లు వ్యవసాయ అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కానీ నాట్ల ప్రక్రియ ఇంకా నడుస్తూనే ఉంది. వెదజల్లే పద్ధతి, యంత్రాలతో నాట్లు వేసే పద్ధతిలో ఇప్పటి వరకు 31,289 హెక్టార్లలో మాత్రమే పూర్తయింది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల నీరు లేక నారుమళ్లు ఎండిపోయే పరిస్థితి తలెత్తిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
తడారుతున్న నారుమళ్లు
● నారుమళ్లు సిద్ధం చేసుకున్న రైతులు వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. వర్షం కురవకపోవడంతో నారుమళ్లు సైతం ఎండిపోతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు కాలువల్లోని నీటిని ఇంజిన్ల సాయంతో తోడి నారుమళ్లు తడిపే పరిస్థితి తలెత్తింది. గతేడాది ఇదే సమయానికి వర్షాలు పుష్కలంగా కురిశాయి. నాట్ల ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఈ ఏడాది మాత్రం నెల రోజులు ఆలస్యంగా సాగుతోంది.
● రాజానగరం నియోజకవర్గం దోసకాయలపల్లి, నందరాడ, నరేంద్రపురం, గాదరాడ, కోటి, శ్రీరంగపట్నం, బొమ్మిల్లంక, మునగాల గ్రామాల్లో మినహా మిగిలిన గ్రామాల్లో నారుమడి దశలోనే ఉన్నాయి. ఆకు మడులు ఎండుతున్న నేపథ్యంలో ఇంజిన్ల ద్వారా తడి ఇస్తున్నారు. బోర్ల నీటి సదుపాయం ఉన్న ప్రాంతాల్లో తప్ప .. మిగిలిన ప్రాంతాల్లో నారుమళ్లు ఎండిపోతున్నాయి. కోరుకొండ మండలంలో సుమారు 5,000 హెక్టార్లలో ఈ పరిస్థితి తలెత్తింది.
● గోపాలపురం నియోజకవర్గం గోపాలపురం, దేవరపల్లి, తాళ్లపూడి మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో నీటికోసం నిరీక్షణ తప్పడం లేదు. నీటి కోసం బోరుబావులపై ఆధారపడుతుండటం, అవి సక్రమంగా పనిచేయపోవడంతో నారుమళ్లు తడారుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 35 వేల హెక్టార్లలో నాట్లకు ఆటంకం ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. నాట్లు వేసిన అనంతరం నీరు పుష్కలంగా ఉండాలి. అప్పుడే పంట దిగుబడి ఆశించిన మేర అందుతుంది.
‘తూర్పు’లో 83,918 హెక్టార్లలో సాగు
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 2025–ఖరీఫ్ సీజన్‌లో 83,918 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. అత్యధికంగా వరి 76,941 హెక్టార్లు, మినుములు 2,595 హెక్టార్లు, మొక్కజొన్న 181, చెరకు 1,480, వేరుశనగ 258, పత్తి 502, కందులు, పెసలు, పసుపు 416 హెక్టార్లలో సాగు చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. సన్నరకాలైన ఎంటీయూ–1224, బీపీటీ–2841, 2270, 2846, ఎన్‌ఎల్‌ఆర్–3238 వంటి రకాలతో పాటు ఎంటీయూ–1318 వంటి నూతన రకాలను సాగు అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
కరుణించని వరుణుడు
జిల్లాలో ఖరీఫ్ సాగు ప్రారంభమైనప్పటి నుంచి వరుణడు కరుణించడం లేదు. ఈ నెల 8వ తేదీన చిరుజల్లులు కురిశాయి. నల్లజర్లలో 3.4 మిల్లీ మీటర్లు, గోకవరంలో 1.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో చినుకు జాడ లేదు. పంటసాగుకు అనువైన సమయంలో వర్షం కురవకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
నాట్లు ఇలా..
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌లో 76,941 హెక్టార్లలో వరి సాగు అవుతుంది. జిల్లావ్యాప్తంగా నాట్ల ప్రక్రియ ఆలస్యంగా సాగుతోంది. గోకవరంలో 5,195 హెక్టార్లలో వరి సాగవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 117 హెక్టార్లలో మాత్రమే నాట్ల ప్రక్రియ పూర్తయింది. పెరవలిలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 3,319 హెక్టార్లు కాగా.. నాట్లు కేవలం 48 హెక్టార్లలో మాత్రమే పడ్డాయి. కేవలం రెండు మండలాల్లోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు నడుస్తోంది.