
లైంగిక వేధింపులపై మహిళా కమిషన్ విచారణ
ఆ నలుగురిని వదలం : చైర్‌పర్సన్ రాయపాటి శైలజ
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులు చోటు చేసుకున్న ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ సోమవారం విచారించారు. ఆమె కాకినాడ రంగరాయ వైద్య కళాశాల, జీజీహెచ్‌లను సందర్శించి విద్యార్థులు, బోధకులతో సమావేశమయ్యారు. తొలుత రంగరాయ వైద్య కళాశాలకు వెళ్లి, నేరుగా బాధిత విద్యార్థినులతో సమావేశమయ్యారు. సమావేశం నిర్వహించిన ఆర్‌ఎంసీ డైనింగ్ హాల్‌లోకి ఎవరినీ అనుమతించకుండా తాను మాత్రమే విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జరిగిన అకృత్యాలను తెలియజేయడానికి విద్యార్థినులు తొలుత భయపడ్డా, తానిచ్చిన భరోసాతో ఒకొక్కరుగా నోరు విప్పారన్నారు. ల్యాబ్ అటెండెంట్ వాడ్రేవు కళ్యాణ్ చక్రవర్తి, ల్యాబ్ టెక్నీషియన్లు బోడే జిమ్మీ రాజు, సరిపల్లి గోపాలకృష్ణ, కొప్పిశెట్టి వీరవెంకటసత్యనారాయణ ప్రసాద్‌ల వైఖరి తమను ఆవేదనతో పాటు భయానికి గురిచేసిందన్నారు. వారి దాష్టికాలు విద్యార్దులను మనో వేదనకు గురి చేశాయని వెల్లడించారు. ఏదో వంకతో తాకే ప్రయత్నం చేసేవారని, అసభ్య భంగిమల్లో ఫొటోలు తీసి వన్ టైం వ్యూ ద్వారా వాట్సాప్‌లో పంపేవారని బాధితులు వెల్లడించారన్నారు. వెకిలి చూపులు వెర్రి చేష్టలతో నరకాన్ని చూపారని, సింగిల్‌గా రూంకి రావాలంటూ ఒత్తిడి చేసేవారని చెబుతూ విద్యార్దులు కన్నీటి పర్యంతమయ్యారన్నారు. సహ ఎల్‌టీలు, నిందితుల అనుయాయుల వల్ల తమకు హాని జరిగే అవకాశం ఉందని విద్యార్దినులు తమ భయాన్ని వెల్లడించారన్నారు. వారికి కమిషన్ తరఫున, పోలీస్ శాఖ తరఫున భరోసా ఇచ్చామన్నారు. లైంగిక వేధింపుల నిందితులు ల్యాబ్ అటెండెంట్ వాడ్రేవు కళ్యాణ్ చక్రవర్తి, ల్యాబ్ టెక్నీషియన్లు బోడే జిమ్మీ రాజు, సరిపల్లి గోపాలకృష్ణ, కొప్పిశెట్టి వీరవెంకటసత్యనారాయణ ప్రసాద్‌లను చట్ట ప్రకారం శిక్షిస్తామని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వీరు విద్యార్థినులతోపాటు జీజీహెచ్‌కు వచ్చే పలువురు మహిళా రోగులపైనా ఈ తరహా అకృత్యాలకే పాల్పడ్డారని తమ విచారణలో వెలుగు చూసిందని అన్నారు. ఈ కీచకులపై చట్ట ప్రకారం తీసుకోవలసిన అన్ని చర్యలపై ఇప్పటికే రాష్ట్ర డీజీపీతో చర్చించామన్నారు. భవిష్యత్తులో మరెవరూ ఇలాంటి దాష్టీకాలకు పూనుకోకుండా గుణపాఠం నేర్చేలా చర్యలుంటాయని తెలిపారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, అదనపు ఎస్పీ దేవరాజ్ పాటిల్, ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్దన్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి పాల్గొన్నారు.