
బీఎల్‌ఓలు బాధ్యతగా ఉండాలి
● ఓటర్ల జాబితా తయారీలో బీఎల్‌ఓ
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
● జిల్లా కలెక్టర్, ఇన్‌చార్జ్ కమిషనర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం సిటీ: ఓటర్ల జాబితా తయారీలో బీఎల్‌ఓలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్, ఇన్‌చార్జ్ కమిషనర్ పి.ప్రశాంతి సూచించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్‌లో బూత్ లెవెల్ అధికారులకు నిర్వహించిన ట్రైనింగ్ కార్యక్రమంలో కలెక్టర్ ప్రసంగించారు. ఎన్నికల ప్రక్రియలో బీఎల్‌ఓల పాత్ర ఎంతో కీలకమన్నారు. శిక్షణ ద్వారా వారి పనితీరులో మెరుగుదలకు అవకాశం లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఫారం–6, 6ఏ, 7, 8 ఓటర్ల జాబితా తయారీ, మార్పులు, చేర్పులు, మరణించినవారు, వలస వెళ్లిన వారి వివరాలను పరిశీలించి తుది సమాచారం ఏ విధంగా అందించాలో సూచించారు. విధి నిర్వహణలో బీఎల్‌ఓలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించిన ప్రాథమిక అంశాలపైన పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. భారత రాజ్యాంగంలో గల అధికరణాల గురించి, ఎన్నికలకు సంబంధించిన ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నమోదు చట్టం, తదితర చట్టాలలోని ముఖ్యమైన సెక్షన్లు గూర్చి కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. బీఎల్‌ఓ పత్రికను ప్రతీ ఒక్కరూ తప్పక చదవాలన్నారు. అడిషనల్ కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, మేనేజర్ అబ్దుల్ మాలిక్, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.