
అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచిన యోధుడు అల్లూరి సీతారామరాజు అని కలెక్టర్ ప్రశాంతి కొనియాడారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 128 జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఆంధ్రులకు గర్వకారణంగా నిలిచిన అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న పుట్టి, యువకుడిగా స్వాతంత్య్ర పోరాటంలో అడుగు పెట్టారన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచిన యోధుడిగా పేరుగాంచారన్నారు. ఆయన జీవితం, పోరాటాలు ఈ తరం ప్రజలకు గొప్ప స్ఫూర్తిదాయకమన్నారు. అల్లూరి సీతారామరాజు ఆదివాసీల హక్కుల కోసం, బ్రి టిష్ హింసాత్మక పాలనకు వ్యతిరేకంగా, అత్యంత ధైర్యంతో గళమెత్తిన తొలి పోరాట యోధుడున్నారు. ఆయన చూపిన త్యాగం, ధైర్యం, నాయకత్వ గుణాలు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ చిన్నరాముడు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థులను క్రీడలలో
ప్రోత్సహించాలి
రాజానగరం: చదువుతోపాటు క్రీడలలోనూ ప్రతిభను కనబరిచేలా విద్యార్థులను ప్రోత్సహించాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ సూచించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనుబంధ కళాశాలల సీనియర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీతో శుక్రవారం సమావేశమై, ఇంటర్ యూనివర్సిటీ క్రీడా పోటీల నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు. ప్రతి కళాశాలలోను క్రీడా మైదానాలను సద్వినియోగపర్చేలా క్రీడలపై విద్యార్థులకు సరైన శిక్షణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో రిజిస్టార్ ఆచార్య కేవీ స్వామి పాల్గొన్నారు.
పంటల బీమా
వినియోగించుకోవాలి
రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలోని రైతులు పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పున సంస్థాపిత వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం ద్వారా ఖరీఫ్ 2025లో రైతులు బీమా చెల్లించాలని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన చాంబర్లో పంటల బీమాకు సంబంధించిన కరపత్రాలను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు మాట్లాడుతూ వరి పంటకు బీమా ఎకరానికి 570 రూపాయలు ఆగస్టు 15 లోపల చెల్లించాలని, మినుముకు ఎకరానికి 300 రూపాయలు ఈ నెల 15 లోపు చెల్లించాలని, అరటి పంటకు ఎకరానికి మూడు వేల రూపాయలు చెల్లించాలన్నారు.
నేడు జాతీయ లోక్ అదాలత్
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ శనివారం ఉదయం 9.45 గంటల నుంచి ప్రారంభమవుతుంది. దీనికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత హాజరవుతారు. కక్షిదారులు కేసులను ఆయా కోర్టుల్లో పరిష్కరిస్తారు. జాతీయ లోక్‌అదాలత్ రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ప్రాంగణంలోని కోర్టుల్లోను, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్దేశించిన కోర్టుల్లోను జరుగనుంది.

అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం