
జవహర్‌ను పదవి నుంచి తొలగించండి
● టీడీపీ దళిత నాయకుల డిమాండ్
● కొవ్వూరులో ఎమ్మెల్యేని
చుట్టుముట్టి ఆందోళన
● ‘పచ్చ’ పార్టీలో మరోసారి
బయటపడిన విభేదాలు
తాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి రోడ్డున పడ్డాయి. ఫ్లెక్సీ వివాదం నేపథ్యంలో పార్టీలోని రెండు వర్గాల్లో ఉన్న దళిత నాయకులు పరస్పర ఆరోపణలకు దిగారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని ఓ వర్గం వారు డిమాండ్ చేశారు. దీంతో వర్గపోరు రచ్చకెక్కింది. వివరాలివీ.. ఎంఆర్‌పీఎస్, దళిత సంఘాల నాయకులు ఆదివారం రాజమహేంద్రవరంలో మీడియా సమావేశం నిర్వహించారు. పశివేదల గ్రామంలో ఏర్పాటు చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ ఫ్లెక్సీలను కొంత మంది చించివేశారని ఆ సందర్భంగా ఆరోపణలు చేశారు. ఈ నెల 23లోగా నిందితులను గుర్తించి, అరెస్టు చేసి, చర్యలు తీసుకోవాలని, లేకుంటే 24న ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో కొవ్వూరు టీడీపీ కార్యాలయం వద్ద దళిత సంఘాల నాయకులు సోమవారం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. జవహర్ ఫ్లెక్సీలు చించివేయడానికి, తమకు ఎటువంటి సంబంధమూ లేదని చెప్పారు. జవహర్ వర్గం కావాలనే టీడీపీ పరువు తీయడానికి చూస్తోందని ఆరోపించారు. అచ్చిబాబు వర్గంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఫ్లెక్సీలు చించిన వారిపై తక్షణం కేసులు పెట్టాలంటూ కొవ్వూరు పోలీస్ స్టేషన్లో జవహర్ వర్గీయులు కొందరు ఫిర్యాదు చేశారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం, కొవ్వూరు ప్రెస్‌క్లబ్‌లో దళిత నాయకులు మాట్లాడుతూ, జవహర్‌పై తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు. నియోజకవర్గం అంటేనే అచ్చిబాబు అని, ఆయనను ఏమైనా అంటే సహించేది లేదని అన్నారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని అడ్డం పెట్టుకుని పార్టీ పరువును జవహర్ బజారున పడేస్తానంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో మీడియా సమావేశం పెట్టినవారు కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన వారు కాదని, వారందరూ జవహర్ వర్గీయులేనని, కావాలనే కేసులు పెట్టి కక్ష సాధించాలని చూస్తున్నారని ఆరోపించారు. వారిని వెంటనే గుర్తించి, చర్యలు తీసుకోవాలని, వారిని వెనుక ఉండి నడిపిస్తున్న ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇటీవల జనసేన నేత టీవీ రామారావు కూటమిలో తమకు ప్రాధాన్యం లేదని, సొసైటీ పదవుల్లో అన్యాయం జరిగిందని ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా జవహర్ వర్గం మీడియా సమావేశం.. దానికి కౌంటర్‌గా కొవ్వూరు టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ దళిత నాయకులు చేసిన ఆందోళనతో కూటమి పార్టీల పరువు బజారున పడింది.

జవహర్‌ను పదవి నుంచి తొలగించండి