
నేటి నుంచి ఆమరణ దీక్ష
● పేపరు మిల్లు కార్మికుల
సమస్యలపై ఇక తాడోపేడో
● వైఎస్సార్ సీపీ నేత
జక్కంపూడి రాజా వెల్లడి
రాజమహేంద్రవరం సిటీ: కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారంలో ఏపీ పేపరు మిల్లు యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యను కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు పరిష్కరిస్తారేమోనని వేచి చూశామన్నారు. సమస్య పరిష్కారంలో తీవ్ర జాప్యం చేస్తున్న నేపథ్యంలో మిల్లు యాజమాన్యంతో ఇక తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమని, మంగళవారం ఉదయం 9 గంటలకు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నానని ప్రకటించారు. పేపరు మిల్లు మెయిన్ గేటు ఎదురుగా ఉన్న శ్రీకృష్ణసాయి కల్యాణ మండపంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. పేపరు మిల్లు ఎదురుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం పాదాల చెంత ఆమరణ దీక్షకు కూర్చుంటానని ప్రకటించారు. దీనికి ఏపీ కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషుబాబు సంఘీభావం తెలపనున్నారని చెప్పారు. మిల్లు కార్మికులకు వేతన ఒప్పందం, ఇతర సౌకర్యాలు కల్పనలో యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని అనేక రూపాల్లో ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తోందని చెప్పారు.
కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిందని, సమస్య పరిష్కారానికి స్థానిక ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చినప్పటికీ యాజమాన్యంతో జరుగుతున్న చర్చలు సఫలం కావడం లేదని రాజా అన్నారు. యాజమాన్యం తీరు చూస్తూంటే సమస్యను పరిష్కరించకుండా వాయిదాలు వేస్తూ కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో యాజమాన్యంతో అమీతుమీ తేల్చుకుంటామన్నారు. ఇటీవల అధికార పార్టీకి చెందిన కార్మిక యూనియన్ నాయకులు తనను విమర్శించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. గతంలో పేపర్ మిల్లులో ప్రభుత్వానికి 27 శాతం వాటా ఉండేదని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వాటాను విక్రయించారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి షేర్లు ఉండేటప్పుడు మిల్లుపై నియంత్రణ ఉండేదని, కార్మికులకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం పరిష్కరించేదని అన్నారు. ప్రభుత్వం తన వాటా వదులుకున్న తర్వాత యాజమాన్యం ఇష్టానుసారం వ్యవహరిస్తోందని చెప్పారు. యాజమాన్యం ఇంత అన్యాయం చేస్తోందంటే గుర్తింపు యూనియన్‌గా ఎవరున్నారో ఒకసారి గుర్తు చేసుకోవాలని అన్నారు. కాార్మికులకు వేతన ఒప్పందం విషయంలో ఇప్పుడు జరిగినంత జాప్యం గత 30 ఏళ్లలో ఎన్నడూ జరగలేదన్నారు. తాను చేస్తున్న ఉద్యమానికి పార్టీలోని ముఖ్య నాయకులు శ్రీఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం, డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, నందెపు శ్రీనివాస్, ఇతర నేతలందరూ మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. అవసరమైతే పేపరు మిల్లు సమస్యను రాష్ట్ర స్థాయికి తీసుకు వెళ్తామన్నారు. వాస్తవానికి ఈ నెల 9 నుంచే ఆమరణ దీక్ష చేయనున్నట్లు ప్రకటించామని, చర్చలు జరుపుతున్నామని, సమస్య పరిష్కారమవుతుందని కూటమి నాయకులు అనడం, కొద్ది రోజులు వేచి చూద్దామని కార్మిక నాయకులు చెప్పడంతో తన దీక్షను రెండుసార్లు వాయిదా వేసుకున్నానని రాజా చెప్పారు. విలేకర్ల సమావేశంలో నందెపు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు బొంత శ్రీహరి, మానె దొరబాబు, మాసా రామ్‌జోగ్, బురిడి త్రిమూర్తులు, అడపా అనిల్, కోడి కోట, నాళం రోశయ్య తదితరులు పాల్గొన్నారు.