
ప్రతిపక్షంపై కక్షపూరితంగా కేసులు
● మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు
● మిథున్‌రెడ్డి అరెస్టుకు నిరసనగా కొవ్వూరులో కొవ్వొత్తుల ర్యాలీ
తాళ్లపూడి (కొవ్వూరు): వైఎస్సార్ సీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎంపీలు, నాయకులపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తోందని, చట్టాలను పక్కన పెట్టి రౌడీ రాజ్యం చెలాయిస్తోందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆరోపించారు. ఎంపీ మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ కొవ్వూరు బస్టాండ్ సెంటర్ వద్ద సోమవారం రాత్రి పార్టీ శ్రేణులతో కలసి ఆయన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. న్యాయం గెలుస్తుందంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన ఎంతోకాలం సాగదని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని అన్నారు. మిథున్‌రెడ్డిపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని వెంకట్రావు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంఠమణి రమేష్, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, చాగల్లు ఎంపీపీ మట్టా వీరాస్వామి, పార్టీ కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు మండలాల కన్వీనర్లు చిట్టూరి అన్నవరం, కొలిశెట్టి నాగేశ్వరరావు, మట్టా వెంకట్రావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.