
అమ్మవారి సన్నిధికి వెంకన్న సారె
● మందపల్లి పార్వతీదేవికి వాడపల్లి నుంచి ఆషాఢ సారె సమర్పణ
● దేవస్థాన ముఖద్వారంలో ఘన స్వాగతం
● శాకంబరిగా పార్వతీదేవి దర్శనం
కొత్తపేట: శనిదోష నివారణకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మందపల్లిలోని ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామివారి క్షేత్రంలో ఆషాఢ మాసం కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. పార్వతీదేవి అమ్మవారిని శాకంబరిగా అలంకరించి, సారె, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్‌బాబు ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకుడు అయిలూరి శ్రీరామమూర్తి, అర్చకులు, వేద పండితులు పార్వతీదేవి అమ్మవారితో పాటు, శనైశ్చర స్వామి, ఇదే క్షేత్రంలో వేంచేసిన బ్రహ్మేశ్వర, నాగేశ్వర స్వామివార్లను కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో విశేషాలంకరణ చేశారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. క్షేత్ర పాలకుడు వేణుగోపాలస్వామిని పుష్పాలతో విశేషంగా అలంకరించారు.
కొనసాగుతున్న సంప్రదాయం
కొన్నేళ్లుగా వస్తున్న ఆషాఢ మాస సంప్రదాయం ప్రకారం కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి మందపల్లి పార్వతీదేవి అమ్మవారికి సారె పంపించారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, వాడపల్లి దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ రాంబాబు, దేవస్థానం సిబ్బంది, పండితులు సారె తీసుకురాగా.. రావులపాలెం–అమలాపురం ప్రధాన రహదారిలో శనైశ్చరస్వామి దేవస్థాన ముఖద్వారం వద్ద ఈఓ సురేష్‌బాబు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. మేళతాళాలు, బాణసంచా కాల్పులతో భారీ ఊరేగింపుగా ఆలయానికి సారెను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. మందపల్లి, ఏనుగుల మహల్, పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.