
నవోదయం ఏదీ..?
రాయవరం: విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు జవహర్ నవోదయ విద్యాలయ సమితి కృషి చేస్తోంది. ప్రతిభావంతులైన విద్యార్థులకు పట్టం కట్టి, వారికి ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఆలయంగా నవోదయ విద్యాలయం భాసిల్లుతోంది. అటువంటి నవోదయ విద్యాలయంలో సీటు వస్తే తమ పిల్ల భవిష్యత్తుకు ఢోకా ఉండదని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. అందుకే తమ పిల్లల్ని చేర్చేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. కారణాలేమైనా ఈ ఏడాది దరఖాస్తుల ప్రక్రియ మందగించడంతో.. గతంతో పోలిస్తే దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. నవోదయలో ఆరో తరగతిలో చేరాలంటే ప్రవేశ పరీక్షే ఆధారం. ఇందులో ప్రతిభ చూపితే సీటు ఖాయం. 2026–27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించారు. ఐదో తరగతిలో చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేయాల్సి ఉండగా, ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య నిరాశాజనకంగా ఉంది. ఈ నెల 29తో దరఖాస్తుల గడువూ ముగియనుంది. కాకినాడ జిల్లాలో పెద్దాపురంలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని విద్యార్థులు మాత్రమే ఇక్కడ దరఖాస్తు చేయాలి. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఉచిత విద్యను ఇక్కడ అందిస్తారు. విద్యతో పాటు, అధునాతన వసతుల కల్పన, ప్రయోగాత్మక విద్య, క్రీడలు, క్రమశిక్షణ, ప్రతిభకు పెద్దపీట వేయడం ఈ విద్యా సంస్థల్లో ప్రత్యేకత.
అవగాహన లేక..?
ఈ ఏడాది డిసెంబర్ 13న నిర్వహించే ప్రవేశ పరీక్షకు మూడు జిల్లాల నుంచి కేవలం 668 దరఖాస్తు మాత్రమే వచ్చాయి. ఉమ్మడి జిల్లా నుంచి అతి తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. 2023–24లో 8,506 దరఖాస్తులు రాగా, గతేడాది మూడు జిల్లాల పరిధిలో 8,971 దరఖాస్తులు వచ్చాయి. ఇలాఉంటే, ఈ ఏడాది 9 వేల వరకు దరఖాస్తులు వస్తాయనే అంచనాతో అధికారులు ఉన్నారు. గడువు సమీపిస్తున్నా తక్కువగా వచ్చిన దరఖాస్తుల సంఖ్య చూసి అధికారులు విస్తుపోతున్నారు. దీనికి కారణం.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సరైన అవగాహన కల్పించక పోవడమా, లేక వారిలో ఆసక్తి సన్నగిల్లడమా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. జవహర్ నవోదయ విద్యాలయంలో సీటు వచ్చినా, రాకున్నా విద్యార్థులతో దరఖాస్తు చేయిస్తే, ఐదో తరగతిలోనే విద్యార్థులకు పోటీతత్వాన్ని అలవాటు చేయడం, ఆన్‌లైన్ పరీక్షను పరిచయం చేసినట్టవుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు. పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయంలో మొత్తం 80 సీట్లు ఉన్నాయి. ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రస్తుతం ఆయా మండలాల్లో ఐదో తరగతి చదువుతున్న బాలబాలికలు అర్హులు. జవహర్ నవోదయ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఒక్కసారి మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. మూడు జిల్లాల్లో ఈ ఏడాది ఐదో తరగతిలో సుమారు 60 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ పొందడానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరయ్యే బాలబాలికలు 2014 మే ఒకటో తేదీ నుంచి 2016 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి. ప్రభుత్వం గుర్తించిన పాఠశాలల్లో 3, 4 తరగతుల్లో ఉత్తీర్ణత సాధించి, ఐదో తరగతి చదువుతున్న వారు మాత్రమే అర్హులు. గతేడాది ప్రవేశ పరీక్షకు హాజరైన వారు అనర్హులు.
జిల్లాల వారీగా దరఖాస్తులు ఇలా..
జిల్లా వచ్చిన నేటి వరకు
దరఖాస్తులు దరఖాస్తులు
(గతేడాది) (ఈ ఏడాది)
కోనసీమ 3,869 201
తూర్పు గోదావరి 1,741 107
కాకినాడ 3,361 360
జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షకు
గణనీయంగా తగ్గిన దరఖాస్తులు
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో
ఆసక్తి అంతంతమాత్రం
ఈ నెల 29తో ముగుస్తున్న గడువు
గతేడాది వచ్చినవి 8,971
ఈ ఏడాది ఇంత వరకు 668 మాత్రమే..
డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష
పరీక్షా విధానమిలా..
నవోదయ ప్రవేశ పరీక్షను ఈ ఏడాది డిసెంబర్ 13న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జిల్లాలో నిర్దేశించిన పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షను విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న భాషను(తెలుగు/ఇంగ్లిష్) ఎంచుకుని పరీక్ష రాయవచ్చు. ప్రవేశ పరీక్షలో 80 ప్రశ్నలుంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు నిర్వహించే ప్రవేశ పరీక్ష రాసేందుకు రెండు గంటల సమయాన్ని కేటాయిస్తారు. మూడు విభాగాల్లో ప్రశ్నలు కేటాయిస్తారు. మేధా శక్తి(మెంటల్ ఎబిలిటీ)పై 50 మార్కులకు 40 ప్రశ్నలు, గణితం(అర్థమెటిక్), భాషపై ఒక్కొక్క విభాగానికి 20 వంతున 40 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. తప్పుడు సమాధానాలకు నెగిటివ్ మార్కులు ఉండవు. దివ్యాంగులకు 40 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయిస్తారు. పరీక్షా పత్రాల రూపకల్పన నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) నిర్వహిస్తుంది. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై, ప్రవేశానికి ఎంపికై న వారికి తొలి రెండేళ్లు తెలుగు/ఇంగ్లిష్ భాషల్లో బోధిస్తారు.
పోటీ పరీక్షలపై అవగాహన
జవహర్ నవోదయ విద్యాలయ సమితిలో సీటు పొందడాన్ని ప్రతిష్టగా భావిస్తారు. ఇందుకు ఏటా దరఖాస్తు చేసిన విద్యార్థులు ప్రత్యేకంగా తర్ఫీదు పొందుతారు. జిల్లాలో ఉన్న ఐదో తరగతి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యేలా పాఠశాలల ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా ఐదో తరగతి నుంచే పోటీ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఆ దిశగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆలోచన చేసి, అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసేలా కృషి చేయాల్సిన అవసరం ఉంది.
ప్రతి విద్యార్థితో దరఖాస్తు చేయించాలి
విద్యార్థులకు అవగాహన కల్పించి ప్రతి విద్యార్థితో దరఖాస్తు చేసేలా ప్రధానోపాధ్యాయులు చొరవ చూపాలి. జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశ పరీక్షకు ప్రతి విద్యార్థి దరఖాస్తు చేయడం ప్రధానమైన విషయంగా భావించాలి. ఈ నెల 29వ తేదీ దరఖాస్తుకు తుది గడువు. ప్రవేశ పరీక్ష దరఖాస్తులను మూడు జిల్లాల విద్యాశాఖాధికారుల ద్వారా పాఠశాలలకు పంపించాం. పాఠశాలలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నాం.
– బి.సీతాలక్ష్మి, ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ విద్యాలయ సమితి, పెద్దాపురం
డీఈవోలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
జవహర్ నవోదయలో గ్రామీణ పాంత విద్యార్థులకు అధిక శాతం సీట్లు కేటాయించడంతో వారికి ప్రయోజనం కలుగుతుంది. జిల్లా విద్యా శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉప విద్యా శాఖాధికారులు, మండల విద్యా శాఖాధికారుల ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. ప్రవేశ పరీక్షను విద్యార్థులతో రాయించడం వల్ల వారిలో పోటీ పరీక్షలను ఎదుర్కోగలిగే ఆత్మ విశ్వాసం ఏర్పడుతుంది.
– జి.నాగమణి, ఆర్‌జేడీ, పాఠశాల విద్యా శాఖ, కాకినాడ

నవోదయం ఏదీ..?

నవోదయం ఏదీ..?

నవోదయం ఏదీ..?