దైవదర్శనానికి వచ్చి అనంత లోకాలకు..
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం అధికారుల నిర్లక్ష్యంతో ఒక యువకుడి ప్రాణం పోయింది. పంపా రిజర్వాయర్‌లో స్నానఘట్టాల వద్ద స్నానం చేసేందుకు దిగిన ఆ యువకుడు శ్రీచక్రస్నానం కోసం తీసిన గోతిలో జారిపడి మృతి చెందాడు. అన్నవరం ఎస్సై శ్రీహరి బాబు తెలిపిన వివరాల ప్రకారం.. కిర్లంపూడి మండలం జగపతి నగరానికి చెందిన 15 మంది భక్తులు బుధవారం సత్యదేవుని దర్శనానికి వచ్చారు. స్నానాలు చేసేందుకు పవర్ ఆఫీసు వద్ద గల పంపా స్నానఘట్టాల వద్దకు వచ్చారు. వీరిలో ముగ్గురు యువకులు నదిలోకి దిగి నడుచుకుంటూ ముందుకు వెళ్లారు. మొదట మూడు అడుగుల లోతు మాత్రమే ఉండడంతో ఇంకా ముందుకు వెళ్లగా సత్యదేవుని చక్రస్నానం కోసం తీసిన గోతిలో జారి మునిగిపోయారు. వారి కేకలు విన్న సమీపంలోని వారు వెంటనే అక్కడకు వెళ్లి ఇద్దరిని ఒడ్డుకు లాగేశారు. వాసంశెట్టి చరణ్ తేజ్ (16) మాత్రం లోపలకు వెళ్లిపోయాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. కొంతసేపటికి చరణ్ తేజ్ పైకి తేలడంతో ఒడ్డుకు తీసుకువచ్చి పరీక్షించగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా.. చరణ్ తేజ్ ఇటీవల విడుదలై పదోతరగతి ఫలితాల్లో కిర్లంపూడి మండలంలోనే మొదటి స్థానం పొందినట్టు తల్లిదండ్రులు తెలిపారు.
నిర్లక్ష్యంగా వదిలేశారు
పంపా నదిలో నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో సత్యదేవుని ఉత్సవాల కోసం నాలుగేళ్ల క్రితం పంపా స్నానఘట్టాలకు సమీపంలో కోనేరు మాదిరిగా ఆరు అడుగుల లోతు గొయ్యి తవ్వారు. ఏటా వేసవిలో నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో ఆ గోతిని మరింత లోతుగా చేసి, దానిలో నీరు నింపి శ్రీరామనవమి వేడుకలు, సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలలో చక్రస్నానం నిర్వహిస్తున్నారు. ఈ నెల 12వ తేదీన కూడా ఆ గోతిలోనే సత్యదేవుని చక్రస్నానం నిర్వహించారు. ఆ కార్యక్రమం అయ్యాక ఆ గోతి చుట్టూ మెస్‌తో ఫెన్సింగ్ చేయడమో లేక ఆ గోతి చుట్టూ సుమారు పది అడుగుల ఎత్తు కలిగిన కర్రలు పాతి జెండాలు అమర్చితే అందరికీ తెలిసేది. ఇటీవల వర్షాలకు పంపాలోకి నీరు చేరి, నీటిమట్టం 88 అడుగులకు వచ్చేసింది. దీంతో ఆ గొయ్యి నీటితో నిండిపోయింది. ఒడ్డు నుంచి చూసే వారికి అక్కడ గొయ్యి ఉందనే సంగతే తెలియదు. చరణ్ తేజ్‌తో పాటు మరో ఇద్దరు కూడా అలాగే ఆ గోతిలో పడిపోయారు.
స్నానం చేసేందుకు వెళ్లిన యువకుడి మృతి
అన్నవరంలోని పంపా స్నానఘట్టాల వద్ద ప్రమాదం
దైవదర్శనానికి వచ్చి అనంత లోకాలకు..


