అమ్మా నాన్నా లేరని.. ఇక రారని | - | Sakshi
Sakshi News home page

అమ్మా నాన్నా లేరని.. ఇక రారని

May 25 2025 8:16 AM | Updated on May 25 2025 8:16 AM

అమ్మా

అమ్మా నాన్నా లేరని.. ఇక రారని

చలించిన పసి హృదయాలు

కళ్లెదుటే తల్లిదండ్రుల మృతితో షాక్‌ అయిన పిల్లలు

జాతీయ రహదారి దేవరపల్లి వద్ద

హృదయ విదారక ఘటన

దేవరపల్లి / గోకవరం : పసిప్రాయం చిన్నబోయింది.. తల్లిదండ్రులు తమ కళ్లెదుటే మృత్యువాత పడడం చూసి గుండె ఆగినట్టు అయ్యింది. తమ ఆలనాపాలనా చూసే అమ్మానాన్న విగతజీవులుగా పడి ఉండడం చూసి ఆ పసివాళ్లు గుండెలవిసేలా రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది.. తల్లిదండ్రులతో కలసి నానమ్మ ఇంటికి వెళుతున్నామన్న ఆ చిన్నారుల ఆనందం అంతలోనే ఆవిరైంది. అనుకోని ప్రమాదంలో తల్లిదండ్రుల మృతితో ఆ చిన్నారులు అనాథలయ్యారు. ఈ హృదయ విదారక ఘటన వివరాల్లోకి వెళ్తే..

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన పేడూరి పెదబేబి (30), దేవరపల్లి సమీపం యాదవోలుకు చెందిన తుంటా దుర్గాప్రసాద్‌ (35)కు సుమారు 13 ఏళ్ల కిందట వివాహం అయ్యింది. వివాహం అనంతరం దుర్గాప్రసాద్‌ గోపాలపురంలోనే తాపీ చేస్తుండగా, పెదబేబి అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తుంది. వీరిద్దరికి కుమార్తె ప్రవల్లిక, కుమారుడు ఇమ్మానుయేల్‌ ఉన్నారు. కుమార్తె వీరలంకపల్లిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో 6వ తరగతి, కుమారుడు గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. ఇదిలా ఉండగా అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు కావడంతో శనివారం మధ్యాహ్నం భార్యాభర్తలు ఇద్దరూ పిల్లలను తీసుకుని యాదవోలుకు బైక్‌పై బయలు దేరారు. వీరు గుండుగొలను– కొవ్వూరు జాతీయ రహదారిపై దేవరపల్లి డైమండ్‌ జంక్షన్‌కు వచ్చేసరికి ఆ ఇద్దరు పిల్లలు టాయ్‌లెట్‌ వస్తుందనడంతో రోడ్డు పక్కన బైక్‌ ఆపారు. పిల్లలను రోడ్డుకు అటువైపు టాయ్‌లెట్‌కు పంపించారు. తన సోదరుడికి తీసుకు వెళుతున్న మామిడి పండ్లను భార్యాభర్తలు సర్దుకుంటుండగా వెనుక నుంచి అతివేగంగా లారీ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో పెదబేబి, దుర్గాప్రసాద్‌ అక్కడకక్కడే దుర్మరణం చెందగా, టాయ్‌లెట్‌కు వెళ్లిన పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో దురా్‌గ్‌ప్రసాద్‌ కాలు తెగి దూరంగా పడిపోయింది. తమ కళ్ల ఎదుటే తల్లిదండ్రులు మృత్యువాత పడడంతో పిల్లలు ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లిపోయారు. ఈ ఘటనా స్థలానికి దేవరపల్లి సీఐ కె.నాగేశ్వర్‌ నాయక్‌, ఎస్సై వి.సుబ్రహ్మణ్యం చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

అమ్మా నాన్నా ఇక లేరని..

అప్పటి వరకూ తల్లిదండ్రులతో ఆనందంగా గడిపిన పిల్లలు తల్లిదండ్రులు ఇక లేరని తెలుసుకుని కన్నీరు, మున్నీరవుతున్నారు. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు దుర్మరణంతో ప్రవల్లిక, ఇమ్మానియేలు దిక్కులేని వారిగా మిగిలారు. ప్రమాద ఘటనను కళ్లారా చూసిన వారు షాక్‌కు గురయ్యారు. అమ్మా నాన్నలు కావాలంటూ రోదిస్తున్నారు.

గోపాలపురంలో విషాదం

భార్యాభర్తలు మృతి చెంది పిల్లలు అనాథలు కావడంతో గోపాలపురంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామస్తులతో మంచి సత్ససంబంధాలు కలిగిన వీరు ప్రమాదంలో మృతి చెందారన్న విషయాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనాథలైన చిన్నారులను తలుచుకుని కన్నీరుమున్నీరు అవుతున్నారు.

మధ్యాహ్నం తాపీ పని ముగించుకుని..

దుర్గాప్రసాద్‌ గ్రామంలో తాపీ పని చేస్తుండేవాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం వరకూ పనిచేసి ఇంటికి వచ్చిన అతను భార్యా పిల్లలతో కలసి సరదాగా గడిపేందుకు తన గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నాలుగు రోజుల కిందట పెదబేబి తన భర్త దుర్గాప్రసాద్‌తో కలసి గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో తోటి అంగన్‌వాడీ టీచర్‌కు సంబంధించిన ఫంక్షన్‌లో పాల్గొంది. ఈ సమయంలో తమతో కలసి ఎంతో సందడి చేసిందని ఇంతలోనే ఇలా జరిగిందని, సహచర అంగన్‌వాడీ సిబ్బంది బోరున విలపించారు.

అమ్మా నాన్నా లేరని.. ఇక రారని 1
1/2

అమ్మా నాన్నా లేరని.. ఇక రారని

అమ్మా నాన్నా లేరని.. ఇక రారని 2
2/2

అమ్మా నాన్నా లేరని.. ఇక రారని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement