
ఇది మానవ హక్కుల ఉల్లంఘనే..
రాజమహేంద్రవరం సిటీ: పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభకు ప్రభుత్వం, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం మానవ హక్కుల ఉల్లంఘనేనని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. నగరంలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసులను అడ్డం పెట్టుకుని సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. పోలీసుల టార్చర్‌తో గుడాల జాన్సన్ అనే వ్యక్తి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభను ఆపేది లేదని, అయితే, ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. త్వరలోనే తేదీ ప్రకటిస్తామన్నారు. సభకు త్వరలోనే హైకోర్టు నుంచి అనుమతి రానున్నదన్నారు. కోర్టుకు తాను ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించినట్లు పోలీసులు చెప్పారని, ఇదే నిజమైతే తనపై ఫోర్జరీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రైస్తవులను వివక్షతో చూస్తూ, అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.