బాకీ అడిగినందుకు చంపేశారు

- - Sakshi

తూర్పు గోదావరి: అవసరానికి రూ.80 వేలు ఇచ్చి ఆదుకున్న వ్యాపారి.. తిరిగి తన బాకీ చెల్లించమని కోరినందుకు అతనిపై ఆ అన్నదమ్ములిద్దరూ కక్ష పెంచుకున్నారు. డబ్బులిచ్చేస్తామని మకాం వద్దకు రప్పించి ఆయన్ను అంతమొందించారు. ముందుగానే తీసిన గోతిలో నిలువునా పూడ్చిపెట్టారు. మండపేటలో ఈ నెల 25న అదృశ్యమైన ధాన్యం కమీషన్‌ వ్యాపారి గొలుగూరి కోదండ వెంకటరామారెడ్డి (44) కేసు చివరకు విషాదాంతమైంది. ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పట్టణంలో సంచలనం కలిగించిన ఈ ఘటనకు సంబంధించి రామచంద్రపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, మృతుని బావ మల్లిడి శ్రీనివాసరెడ్డి, స్థానికులు తెలిపిన వివరాలివీ..

స్థానిక నారాయణ స్కూల్‌ సమీపంలో నివసించే రామారెడ్డికి తన ఇంటికి కూతవేటు దూరంలో నివాస స్థలం ఉంది. ప్రతీ రోజు ఉదయం అక్కడ వాకింగ్‌కు వెళుతుండేవారు. పక్క స్థలంలో వీరభద్రపురంనకు చెందిన అన్నదమ్ములు రావూరి సూర్యారావు, ఏసురాజులు పశువుల మకాం నిర్వహిస్తుండేవారు. వీరి వద్ద నుంచి పాలు కొనుగోలు చేసే క్రమంలో రామారెడ్డికి వారితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో డెయిరీ కోసమని రూ.50 వేలు అప్పు తీసుకుని తిరిగి చెల్లించేశారు. ఏడాది క్రితం మళ్లీ రూ.80 వేలు అప్పుగా తీసుకున్నారు. మకాంలోని గేదెలను అమ్మేస్తుండటంతో కొద్ది రోజులుగా తన బాకీ చెల్లించమని రామారెడ్డి వారిని కోరుతున్నాడు.

దీనిని అవమానంగా భావించిన వారు ఆయన్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. తమ మకాంలో ఎనిమిది అడుగుల లోతున నిలువుగా గోతిని తవ్వి ఎవరికీ అనుమానం రాకుండా దానిపై తాటాకులు, గడ్డి కప్పి ఉంచారు. ఈ నెల 25వ తేదీ మధ్యాహ్న సమయంలో బాకీ చెల్లిస్తామని, తాము రాసిన నోటు తీసుకురమ్మని బయటి వ్యక్తి ఫోన్‌ నుంచి రామారెడ్డికి ఫోన్‌ చేశారు. నిజమని నమ్మి రామారెడ్డి ఇంట్లో భార్యకు చెప్పి మకాం వద్దకు వచ్చాడు. ఆయన్ను జాగ్రత్తగా గోతి వద్దకు రప్పించి ఒక్కసారిగా గోతిలో పడేసి రాళ్లతో కొట్టి హత్యచేశారు. అతని మెడలో ఉన్న గొలుసును తీసుకుని మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. రాత్రి అయినా తన భర్త ఇంటికి తిరిగిరాకపోవడంతో రామారెడ్డి భార్య శ్వేతనాగదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రామారెడ్డి కాల్‌డేటా, భార్య ఇచ్చిన వివరాలతో సీఐ పి.శివగణేష్‌, ఎస్‌ఐ ఎం.అశోక్‌, ఐడీ పార్టీ కేసు దర్యాప్తు చేపట్టారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా పరారీలో ఉన్న సూర్యారావును అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగుచూసింది. విచారణలో సూర్యారావు కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడంతో పూర్తి ఆధారాల సేకరణకు పోలీసులకు కొంత సమయం పట్టింది. రామారెడ్డి మెడలోని గొలుసును రూ.లక్షకు తాకట్టు పెట్టి ఒక సెల్‌ఫోన్‌ కొని మిగిలిన సొమ్ముతో జల్సాలు చేసినట్టు పోలీసులు తెలిపారు.

నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం తహసీల్దార్‌ టీఆర్‌ రాజేశ్వరరావు, ఫొరెన్సిక్‌ అధికారుల సమక్షంలో మకాం వద్ద పూడ్చిపెట్టిన గోతి నుంచి మృతదేహాన్ని బయటకు తీసి శవ పంచనామా చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు ఏసురాజు కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసును తాము ప్రత్యేకంగా భావిస్తూ నాలుగైదు నెలల్లోనే ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులకు శిక్ష పడే విధంగా కృషిచేస్తామని డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ మృతుని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

శోక సంద్రంలో రామారెడ్డి కుటుంబం
రామారెడ్డి మృతితో అతని కుటుంబ శోకసంద్రంలో మునిగిపోయింది. తన భర్త క్షేమంగా తిరిగివస్తాడని వారం రోజులుగా వెయి కళ్లతో ఎదురుచూస్తున్న భార్య నాగదేవి, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సౌమ్యునిగా మంచి పేరున్న రామారెడ్డి దారుణహత్యకు గురికావడం అందరినీ కలచివేసింది. ఆయన్ను చివరిసారి చూసేందుకు తోటి వ్యాపారులు, అనపర్తి మండలం రామవరం, పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన సన్నిహితులు, బంధువులతో సంఘటన స్థలం హృదయవిదారకంగా మారింది. రూ.80 వేలు బాకీ కోసం హత్య చేశారన్న వార్త పట్టణంలో సంచలనంగా కలిగించింది.

Read latest East Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top