
జి.మామిడాడలో కొలువైన సీతారాములు వారు
● నేడు ఊరూవాడా సీతారామ కల్యాణాలు ● జి.మామిడాడలోని కోదండరామాలయంలో భారీగా ఏర్పాట్లు
పెదపూడి: జగదానంద కారకుడి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఊరూవాడా రాములోరి పెళ్లి వేడుకలకు సిద్ధమయ్యాయి. చూడముచ్చటైన ఆ ఘట్టాన్ని కనులారా తిలకించేందుకు జనం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కాకినాడ జిల్లాలోని పెదపూడి మండలం గొల్లల మామిడాడలో శ్రీ కోదండ రాముడి కల్యాణ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కోరిన కోర్కెలు తీర్చే వేల్పుగా కోదండరాముడు భక్తుల విశ్వాసం పొందుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలోని భద్రాది రాముడి ఆలయానికి దీటుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. రెండవ భద్రాదిగా పేరుగాంచిన ఆలయంలో తూర్పు, పశ్చిమ దిశల్లో నిర్మించిన గోపురాలు అత్యంత ఎత్తైనవిగా పేరుగాంచాయి. వాటిపై శిల్పాలను భాగవత, రామాయణాల్లోని అపురూప ఘట్టాలతో మనోహరంగా తీర్చిదిద్దారు.
గొల్లల మామిడాడలో శ్రీ కోదండ రామాలయం కల్యాణకాంతులను సంతరించుకుంది. గురువారం జరిగే సీతారాముల కల్యాణానికి భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. వేల సంఖ్యలో హాజరై భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మంచి ముత్యాలను తలంబ్రాలుగా వాడతారు. కల్యాణ ఉత్సవాలు 29 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగుతాయి.
కల్యాణోత్సవ కార్యక్రమాల వివరాలు
● 31వ తేదీన సుప్రభాత సేవ, నిత్యోపాసన, డోలు సన్నాయి. రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు
● ఏప్రిల్ 1వ తేదీన సహస్రనామార్చన, మధ్యాహ్నం 3.30 గంటలకు సదస్యం
● 2వ తేదీ ఉదయం శేష వాహనంపై స్వామివారి గ్రామోత్సవం
● 3వ తేదీ ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం, కంకణ విసర్జనం, పూర్ణాహూతి, రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు
● 4వ తేదీ అద్దాల శయన మందిరంలో రాత్రికి ఊయల సేవ, శ్రీ పుష్పయాగం కార్యక్రమాలతో కల్యాణోత్సవాలు ముగుస్తాయి.
ఇదీ ఆలయ చరిత్ర
క్రీస్తు శకం 1889లో గొల్లల మామిడాడ గ్రామస్తులు ద్వారంపూడి సుబ్బిరెడ్డి, రామారెడ్డి చిన్న రామాలయాన్ని నిర్మించి అందులో సీతాసమేత శ్రీ రామచంద్రుడి కర్ర బొమ్మ(కోలలు) నిర్మించి ప్రతి రోజూ ధూప దీప నైవేద్యాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజనలు నిర్వహించారు. కాలక్రమేణా కోలలు స్థానే 1939లో శిల్ప కళా శోభితమైన శ్రీ రామలక్ష్మణ సీతాహనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1950లో పశ్చిమ గోపురం, 1956లో తూర్పు గోపురాన్ని నిర్మించి, ఈ రెండు గోపురాల మధ్య ఆనుకుని పైన ఒక మంటపాన్ని నిర్మించి అందులో మయసభ, సుందరమైన అద్దాల మందిరం నిర్మించారు.
చేబ్రోలులో
శ్రీసీతారాముల వారు
అయోధ్య రాముడి కల్యాణం అర్ధరాత్రి
చేబ్రోలులో ఏళ్ల తరబడి ఆచారం
పిఠాపురం: ఏటా శ్రీరామ నవమి రోజున మధ్యాహ్నం శ్రీసీతారాముల కల్యాణం అన్నిచోట్లా జరగడం ఆచారం. అయితే కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో మాత్రం ఆరోజు అర్ధరాత్రి నిర్వహిస్తారు. రాత్రి 10 గంటల తరువాతే పెళ్లి తంతు ప్రారంభమవుతుంది. కల్యాణం పూర్తయ్యే సరికి అర్ధరాత్రి దాటుతుంది. ఈ ఆచారం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. పూర్వం రాజుల కాలంలో నిర్మించినన ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. పూర్వం సీతారాముల కల్యాణాలు ఆయా రాజుల ఆధ్వర్యంలో నిర్వహించేవారు. రాజు గారు వచ్చినప్పుడే కల్యాణం ప్రారంభమయ్యేది. పిఠాపురం సంస్థానాధీశులు పూర్వం తమ సంస్థానం పరిధిలో శ్రీరామ నవమి నాడు అన్ని ఆలయాలకు వెళ్లి పూజలు చేసి చివరకు చేబ్రోలు ఆలయానికి చేరుకునే సరికి అర్ధరాత్రి అయ్యేది. ఆయన వచ్చాకా కల్యాణం జరిపించేవారు. వందల ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతుండడంతో దానిని ఇప్పటికీ అమలు చేస్తున్నారు. భద్రాద్రి రాముని కల్యాణం సైతం పగలు జరుగుతుండగా ఇక్కడ మాత్రమే రాత్రి పూట జరగడం విశేషమని ఆలయ అర్చకులు రేగేటి రామాచార్యులు తెలిపారు. ఈ ఏడాది గురువారం అర్ధరాత్రి సీతారాముల కల్యాణం భక్త జన సందోహం నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది.

జి.మామిడాడలో కోదండ రామాలయం గోపురాలు

ఆకట్టుకునే అద్దాల మందిరం

చేబ్రోలులో అర్ధరాత్రి రాముల వారి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు (ఫైల్)
