● మున్సిపల్ ఎన్నికలకు తొలి అడుగు
● చైర్మన్ పదవులకు రిజర్వేషన్ల ఖరారు
● కోనసీమలో స్థానిక ఎన్నికల కాక
● ఆశావహుల్లో అప్పుడే సందడి
సాక్షి, అమలాపురం: పట్టణాల్లో శ్రీస్థానికశ్రీ సమరానికి తొలి అడుగు పడింది. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో ఇంకా స్పష్టత లేకపోయినా.. రిజర్వేషన్లు ఖరారు కావడంతో జిల్లాలో ‘పుర’పోరు వేడి మొదలైంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్మన్ పదవులపై స్పష్టత రావడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారు. ఈసారి చైర్మన్ పదవికి నేరుగా ఎన్నికలు నిర్వహిస్తున్నందున ఆయా పార్టీలతో తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకుంటే చాలన్నట్టుగా పైరవీలకు శ్రీకారం చుట్టారు. పార్టీ ముఖ్యులు, స్థానిక నేతలతో మంతనాలు సాగిస్తూ తమకు అనుకూలమైన రాజకీయ వాతావరణాన్ని సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు వార్డుల్లో పట్టున్న నాయకులు, సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాలపై రాజకీయ పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. నోటిఫికేషన్ వెలువడితే ప్రచారానికి తెర తీయడమే తరువాయి అన్నట్టుగా జిల్లాలో రాజకీయ సందడి కనిపిస్తోంది. జిల్లాలోని అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలతో పాటు ముమ్మిడివరం నగర పంచాయతీలో చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అమలాపురం జనరల్, రామచంద్రపురం బీసీ జనరల్, ముమ్మిడివరం బీసీ మహిళకు కేటాయించారు. దీంతో, ఆయా స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు తమ ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా చైర్మన్ పదవిని దృష్టిలో ఉంచుకుని ఏ వార్డు నుంచి పోటీ చేస్తే అనుకూలంగా ఉంటుందనే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు.
నోటిఫికేషన్ కోసం ఎదురు చూపులు
రిజర్వేషన్లు ఖరారు కావడంతో స్థానిక ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో చర్చలు జోరందుకున్నాయి. అభ్యర్థుల ఎంపిక, వార్డుల వారీగా బలాబలాల అంచనా, సామాజిక సమీకరణాలు, ప్రత్యర్థుల వ్యూహాలపై ఆయా రాజకీయ పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఆశావహులు మాత్రం తమకు టికెట్ దక్కేలా పార్టీ పెద్దల వద్ద ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్, పూర్తి షెడ్యూల్ ఇంకా వెలువడాల్సి ఉంది. అలాగే, వార్డుల రిజర్వేషన్లు కూడా ఖరారు కావాల్సి ఉంది. అవి ప్రకటించిన తర్వాతే పోటీ చేసే అభ్యర్థులు, ఎన్నికల ప్రచారంపై స్పష్టత రానుంది. ఆ తరువాత కోనసీమలో పురపోరు రసవత్తరంగా మారనుంది.
అమలాపురం.. వరుసగా నాలుగోసారీ జనరల్
అమలాపురం మున్సిపాలిటీలో చైర్మన్ పదవి వరుసగా నాలుగోసారి కూడా జనరల్ కేటగిరీకే కేటాయించడం ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే 1987లో ఎస్సీ జనరల్ కేటగిరీకి రిజర్వు కాగా ఉండ్రు బుల్లియ్య ఎన్నికయ్యారు. 1995లో జనరల్ మహిళకు కేటాయించగా కల్వకొలను ఛాయాదేవి, 2000లో బీసీ కేటగిరీకి రిజర్వు చేయగా కలకొండ సుబ్బారావు చైర్మన్లుగా ఎన్నికయ్యారు. 2005 నుంచి వరుసగా జనరల్, జనరల్ మహిళకు అవకాశం దక్కుతోంది. 2005లో జనరల్ కేటగిరీలో నల్లా విష్ణుమూర్తి ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లోనూ జనరల్ కేటగిరీకి కేటాయించడంతో యాళ్ల మల్లేశ్వరరావు, చిక్కాల వినాయకరావు (గణేష్), యాళ్ల నాగ సతీష్ చైర్మన్లుగా పని చేశారు. 2021లో జనరల్ మహిళకు కేటాయించగా రెడ్డి సత్య నాగేంద్రమణి (బీసీ మహిళ) చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. తాజాగా మరోసారి జనరల్ కేటగిరీకే ఈ పదవి రిజర్వు కావడంతో ఈసారి ఈ పీఠాన్ని దక్కించుకునేందుకు ఎవరెవరు రంగంలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది.
బీసీ జనరల్‌కు రామచంద్రపురం
రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ పదవిని బీసీ జనరల్‌కు కేటాయించారు. 1987లో జనరల్ కాగా ఎస్‌ఆర్‌కే రామచంద్రరాజు (రాజబాబు), 1995లో జనరల్ కేటగిరీ నుంచి కొండపల్లి కనక లింగేశ్వరరావు, 2000లో జనరల్ మహిళకు కేటాయించగా ఎస్‌ఆర్‌కే విజయాదేవి, 2005లో ఎస్సీ మహిళకు రిజర్వ్ చేయగా పంతగడ జీవనజ్యోతి, 2014లో జనరల్ కేటగిరీ నుంచి తొలుత కొమ్మన నాగేశ్వరరావు, తరువాత ఎస్‌ఆర్‌కే గోపాలబాబు మున్సిపల్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. 2021లో జనరల్ మహిళకు కేటాయించగా, ఆ ఎన్నికల్లో గాధంశెట్టి శ్రీదేవి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. తాజా రిజర్వేషన్‌తో బీసీ వర్గానికి చెందిన ఆశావహుల్లో ఆసక్తి పెరిగింది.
బీసీ మహిళకు ముమ్మిడివరం
ముమ్మిడివరం నగర పంచాయతీ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు కేటాయించగా చెల్లి శాంతకుమారి ఎన్నికయ్యారు. 2021లో ఎస్సీ జనరల్‌కు రిజర్వు కావడంతో కమిడి ప్రవీణ్ కుమార్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు మూడోసారి జరగనున్న ఎన్నికల్లో చైర్మన్ పదవి బీసీ మహిళకు కేటాయించడంతో ఆ సామాజికవర్గ మహిళా నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.


