అమలాపురం టౌన్: రైతు బజార్లలో కిలో రూ.52కే 10 కిలోల పరిమితితో ప్రభుత్వం బీపీటీ బియ్యం సరాఫరా చేస్తున్నట్టు చెబుతూండగా.. స్థానిక రైతు బజారుకు సన్నబియ్యానికి బదులు ముతక బియ్యం వచ్చాయి. మొత్తం 2,900 కిలోల బియ్యం రాగా.. ఇవి కిలో రూ.52 బియ్యం అంత నాణ్యతగా లేవంటూ వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో, వీటి అమ్మకాలను తక్షణం నిలిపివేశారు. నాణ్యత తక్కువగా ఉన్న ఈ బియ్యాన్ని వెనక్కి పంపించేస్తామని రైతు బజారు నిర్వాహకులు తెలిపారు. రైతు బజార్లలో రూ.52కే కిలో సన్న బియ్యం అమ్మే విధానాన్ని కూటమి ప్రభుత్వం అట్టహాసంగా అమలు చేయగా.. కొద్ది రోజులకే కిలో రూ.50కే అది కూడా 26 కిలోల బస్తా తీసుకోవాలంటూ మెలిక పెట్టింది. ఇంతకు ముందు 10 కిలోల పరిమితితో రైతు బజార్లలో సన్నబియ్యం విక్రయించేవారు. ఇప్పుడు ఈ లూజు అమ్మకాలకు స్వస్తి చెప్పి, కిలో రూ.50 చొప్పున 26 కిలోల బస్తాను రూ.1,300 చెల్లించి కొనుగోలు చేసే విధానాన్ని ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది. అమలాపురం రైతు బజారులో ధరణి పేరుతో కిలో రూ.50 రకం బియ్యం మూడు టన్నులు సరాఫరా చేసింది. అయితే, ఒకేసారి అంత మొత్తం పెట్టి కొనుగోలు చేసేందుకు వినియోగదారులు వెనుకడుగు వేస్తున్నారు.
చించినాడ బ్రిడ్జిపై
15న రాకపోకల నిలిపివేత
అమలాపురం రూరల్: కోనసీమ – పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతున్న చించినాడ వంతెనపై ఈ నెల 15వ తేదీ ఉదయం 6 నుంచి 16వ తేదీ ఉదయం 6 గంటల వరకూ రాకపోకలను నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వంతెనపై బిటుమినస్ కాంక్రీట్, తుది తారు పొర ఏర్పాటు చేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
‘స్థానిక’ ఎన్నికలకు
పకడ్బందీ ఏర్పాట్లు
అమలాపురం రూరల్: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ వైఖోం నైడియాదేవితో కలసి కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, అధికారుల వివరాలను సమగ్రంగా రూపొందించాలని సూచించారు. జిల్లాలోని సుమారు 4 వేల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య ఆధారంగా సిబ్బందిని కేటాయించాలన్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు, పోలింగ్ అనంతరం సామగ్రి స్వీకరణ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లపై దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ వి.సుబ్బారావు, అమలాపురం, కొత్తపేట ఆర్‌డీఓలు ఎం.సరళాదేవి, జీవీవీ సత్యనారాయణ, అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్లు ఎం.నిర్మల్ కుమార్, రామరాజు, ఆర్‌ఆర్ రాజు తదితరులు పాల్గొన్నారు.


