సమస్యలే సమస్తం | - | Sakshi
Sakshi News home page

సమస్యలే సమస్తం

Oct 13 2026 12:17 AM | Updated on Oct 13 2026 12:17 AM

పరిహారం అందలేదు

మా గ్రామంలో గత ఏడాది 2.18 ఎకరాలు కౌలుకు తీసుకుని అరటి తోట వేశారు. గత అక్టోబర్‌లో వచ్చిన తుపానుకు తోట పూర్తిగా నాశనమైంది. ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం నుంచి నాకు ఎటువంటి నష్ట పరిహారమూ అందలేదు. కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌లో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎటువంటి ప్రయోజనమూ లేదు. అధికారులను అడిగితే పైనుంచి నిధులు రాలేదని, తామేమీ చేయలేమని చెబుతున్నారు. ఈ ప్రభుత్వంలో నష్టపోయిన రైతును ఆదుకునే వారే లేరు. ఇప్పటికై నా నాకు పరిహారం అందించాలి.

– గోసంగి గోపాలకృష్ణ, కౌలు రైతు,

గున్నేపల్లి అగ్రహారం, అమలాపురం మండలం

చంద్రన్న బీమా అందలేదు

నా భర్త రెండేళ్ల క్రితం అకాల మరణం చెందాడు. జీవనాధారం కోల్పోయిన నాకు చంద్రన్న బీమా పథకంలో సహాయం అందించాలని మండల అధికారులకు మొర పెట్టుకున్నాను. ఫలితం లేకపోవడంతో కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశాను. బీమా లేదని, సాయం రాదని అధికారులు నా దరఖాస్తు తిరస్కరించారు. నాకు కలెక్టరే న్యాయం చేయాలి.

– గాడ దుర్గ, చిలకలపాడు, మడికి, ఆలమూరు మండలం

● పీజీఆర్‌ఎస్‌లో అర్జీలకు లభించని పరిష్కారం

● పదేపదే తిరుగుతున్న జనం

అమలాపురం రూరల్‌: కూటమి ప్రభుత్వంలో తమ సమస్యలకు పరిష్కారం లభించడం లేదంటూ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎంతో గొప్పగా చెబుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో ఇస్తున్న అర్జీలకు పరిష్కారం కానరావడం లేదని వాపోతున్నారు. మండలం నుంచి జిల్లా స్థాయి వరకూ అర్జీలు ఇస్తున్నా.. ఎక్కడి సమస్య అక్కడే ఉంటోందని చెబుతున్నారు. అయినప్పటికీ, ఏదో ఒక పరిష్కారం లభించకపోతుందా అనే ఆశతో కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చి, అర్జీలు సమర్పించారు. వారి నుంచి జాయింట్‌ కలెక్టర్‌ వైఖోం నైడియాదేవి, డీఆర్‌ఓ వి.సుబ్బారావు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ డి.అచ్యుతాకుమారి, డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు డి.రాంబాబు, జీఎస్‌ రామ్‌గోపాల్‌, సమగ్ర శిక్ష ఏపీడీ మమ్మీ, జిల్లా స్వర్ణ, గ్రామ వార్డు అధికారి వి.విజయలక్ష్మి తదితరులు అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు 179 అర్జీలు అందజేశారు.

రెండో రైల్వే లైన్‌ తూర్పున వేయాలి

కోటిపల్లి – నర్సాపురం రెండో రైల్వే లైన్‌ వల్ల నాలుగుచోట్ల హైవే క్రాసింగ్‌ వస్తుందని, అందువలన ఈ రైల్వే లైన్‌ను తూర్పున ఏర్పాటు చేయాలని అమలాపురం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు చాంబర్‌ అధ్యక్షుడు బోణం సత్యవరప్రసాద్‌, ముఖ్య సలహాదారులు నల్లా పవన్‌ కుమార్‌, కంచిపల్లి అబ్బులు, ఉపాధ్యక్షులు మోకా వెంకటసుబ్బారావు, కోకా రాంబాబు, తేతల సత్యనారాయణరెడ్డి, అరిగెల నాని, దోసూరి కాశి, ఆశెట్టి శ్రీనివాస్‌, వలవల శివరావు, కొవ్వూరి వెంకటరెడ్డి, మానే ప్రకాష్‌, గోకరకొండ ప్రసాద్‌ తదితరులు జేసీ నైడియాదేవికి వినతిపత్రం సమర్పించారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 21 అర్జీలు

అమలాపురం టౌన్‌: ఎస్పీ కార్యాలయంలో జరిగిన పీజీఆర్‌ఎస్‌కు 21 అర్జీలు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ రాహుల్‌ మీనా, ఏఎస్పీ మహేంద్ర మత్తే ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల పరిష్కారంపై ఆయా పోలీస్‌ స్టేషన్ల సీఐలు, ఎస్సైలతో మాట్లాడారు. ఎక్కువగా ఆస్తి తగాదాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులే ఉండటంతో వారికి ఎస్పీ, ఏఎస్పీ కౌన్సెలింగ్‌ చేసి, సమస్యలు పరిష్కరించే ప్రయత్నాలు చేశారు.

రోడ్డు ఆక్రమణలు తొలగించాలి

మా ఇంటి ఎదురుగా యాభయ్యేళ్ల నుంచి పంచాయతీ రోడ్డును మాతో పాటు గ్రామస్తులందరూ వాడుకుంటున్నారు. మా ఇంటి పక్క నుంచి కొందరు ఈ రోడ్డును ఆక్రమించుకుని, మట్టితో కప్పేసి వాహనాలు, ప్రజలు, పశువుల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నారు. దీనిపై గ్రామ పంచాయతీ, మండల అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. సంబంధిత అధికారులు వెంటనే రోడ్డు ఆక్రమణలను తొలగించాలి.

– ఏడిద రామారావు, గంటి పెదపూడి,

పి.గన్నవరం మండలం

డ్రైనేజీ నిర్మించాలి

మా కాలనీలో సుమారు 60 కుటుంబాలు ఉంటున్నాయి. కాలనీలో సీసీ రోడ్లు, విద్యుత్‌, వీధి దీపాల సౌకర్యాలు కల్పించారు. ఇరవయ్యేళ్లుగా డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో మురుగునీరు బయటకు వెల్లే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నాం. మేం తవ్వుకున్న గుంతలు నిండిపోయి, మురుగు నీరు బయటకు పొంగి పొర్లుతోంది. దీనివలన దోమలు అధికంగా పెరిగి అనారోగ్యం బారిన పడుతున్నాం. వెంటనే మా కాలనీలో డ్రైనేజీ నిర్మించాలని కలెక్టర్‌కు విన్నవించాం. – రాజేశ్వరి కాలనీ వాసులు,

పుల్లేటికుర్రు, అంబాజీపేట మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement