అమలాపురం రూరల్: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెపా) పీడీగా ఐఏఎస్ అధికారిని నియమించాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో మహిళల ఆర్థిక స్వావలంబనకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఇది అత్యవసరమని పేర్కొంటూ కలెక్టరేట్‌లో ఆయన సోమవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం, విలేకర్లతో మాట్లాడుతూ, మెప్మాకు కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తోందని, సరైన అధికారులను నియమించకపోవడంతో పర్యవేక్షణ సక్రమంగా లేక సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు జరగడం లేదని అన్నారు. పట్టణ ప్రాంతాల్లోని మహిళా వీధి వ్యాపారులకు మెప్మా ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని అన్నారు. పేద కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, మహిళలను స్వయం సహాయక సంఘాలుగా సంఘటితం చేయడం, పట్టణ నిరుద్యోగ యువతకు ఉపాధి ఆధారిత నైపుణ్య శిక్షణ అందించడం మెప్మా ప్రధాన లక్ష్యాలని చెప్పారు. స్వయం ఉపాధికి బ్యాంకు రుణాలు, సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు, ధ్రువపత్రాలు జారీ చేయడంతో పాటు ఆర్థిక సహాయం అందించాలని, నిరాశ్రయుల కోసం పట్టణ ప్రాంతాల్లో ఆశ్రయ కేంద్రాలు నిర్మించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పంట కాలువల కబ్జా
డెల్టాలోని పంట కాలువలను కూటమి ప్రభుత్వం కబ్జాలు చేస్తోందని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ధవళేశ్వరం నుంచి అమలాపురం వరకూ 62–70 మీటర్లు వెడల్పు ఉండే కాలువలను కబ్జాల పాలు చేసిందన్నారు. సెప్టిక్ వ్యర్థాలను వదిలేసి పంట కాలువలను కలుషితం చేస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డెల్టా కాలువల ఆధునీకరణకు రూ.2,800 కోట్లు కేటాయించి, డీపీఆర్ లేకుండా ప్రైవేటు సంస్థకు పనులు అప్పగించి అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు.


