● పేదరాలికి విద్యుత్ షాక్
● చిన్న రేకుల షెడ్డుకు రూ.47 వేల బిల్లు
కాట్రేనికోన: పల్లంకుర్రు పంచాయతీ చీకురుమిల్లిపేటకు చెందిన పేద మహిళ తిరుకోటి జయలక్ష్మికి విద్యుత్ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ఆమెకు ఉన్న చిన్న రేకుల షెడ్డుకు సర్వీసు నంబర్ 1413300717001438తో ఆ శాఖ సిబ్బంది ఆమె భర్త పేరిట గతంలో కమర్షియల్ మీటర్ వేశారు. దీనికి గత జనవరి నెలలో 4,885 యూనిట్ల విద్యుత్ వాడినట్లు చూపించి, ఏకంగా రూ.47,063కు బిల్లు ఇచ్చారు. దీనిపై ఆమె తొలుత కాట్రేనికోనలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో ఫిర్యాదు చేశారు. ఎటువంటి స్పందనా లేకపోవడంతో అమలాపురం కలెక్టరేట్‌లో స్వయంగా అర్జీ సమర్పించారు. అయినప్పటికీ విద్యుత్ శాఖ అధికారుల్లో కనీస స్పందన కూడా లేకుండా పోయింది. కరెంటు బిల్లు చెల్లించకపోవడంతో ఆమె విద్యుత్ కనెక్షన్‌ను సిబ్బంది తొలగించారు. దీంతో, గత 8 నెలలుగా ఆమె కుటుంబం కటిక చీకట్లోనే కాలం వెళ్లదీస్తోంది. అంతే కాకుండా, ఈ బిల్లు పుణ్యమా అని ఆమె ఇద్దరు మనవరాళ్లకు తల్లికి వందనం పథకం నిధులు నిలిచిపోయాయి. అర్హత ఉన్నా వితంతు పింఛనుకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా కోల్పోయానని జయలక్ష్మి వాపోతు న్నారు. ఇప్పటికైనా తన ఇంటికి ఉచిత విద్యుత్‌ను పునరుద్ధరించాలని ఆమె కోరుతున్నారు.


