అన్నీ మీకేనా.. మాకేం లేవా? | - | Sakshi
Sakshi News home page

అన్నీ మీకేనా.. మాకేం లేవా?

Sep 17 2026 12:08 AM | Updated on Sep 17 2026 12:08 AM

పుర పీఠంపై కూటమిలో పీటముడి

అమలాపురంలో సైకిల్‌ –

టీ గ్లాసు ఢీ అంటే ఢీ

టీడీపీకే ఎమ్మెల్యే, ఏఎంసీ,

అముడా పదవులు

మున్సిపల్‌ చైర్మన్‌గిరీ తమకే

ఇవ్వాలని జనసేన పట్టు

ససేమిరా అంటున్న టీడీపీ

అధిష్టానాల వద్దకు

మున్సిపల్‌ పంచాయితీ

సాక్షి, అమలాపురం: కూటమిలో కొత్త చిచ్చుకు అమలాపురం మున్సిపల్‌ చైర్మన్‌ పదవి కారణమవుతోంది. టీడీపీ – జనసేన మధ్య ఇప్పటికే ఉన్న రాజకీయ విభేదాలకు ఇది మరింత ఆజ్యం పోస్తోంది. అన్ని పదవులూ వదులుకుంటున్న తమకు మున్సిపల్‌ చైర్మన్‌ పదవి ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కాల్సిందేనని జనసేన పట్టుబడుతూండగా.. టీడీపీ నేతలు ససేమిరా అంటున్నారు. ఆ సీటు కూడా తమకే ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో చైర్మన్‌ పదవి కోసం ఇరు పార్టీల మధ్య ఢీ అంటే ఢీ అన్నట్టుగా పరిస్థితి మారింది. ఈ వ్యవహారం ఇప్పటికే ఆ రెండు పార్టీల అధిష్టానాల దృష్టికి వెళ్లగా.. ఇరు వర్గాలూ తమ వాదనలు వినిపిస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో అమలాపురం పార్లమెంటరీ స్థానం పరిధిలోని మండపేట, రామచంద్రపురం, ముమ్మిడివరం, కొత్తపేట నియోజకవర్గాలను టీడీపీకి, రాజోలు జనసేనకు కేటాయించిన విషయం తెలిసిందే. అమలాపురం, పి.గన్నవరం స్థానాల విషయంలో చివరి వరకూ ఉత్కంఠ నెలకొంది. తొలుత పి.గన్నవరం స్థానాన్ని టీడీపీ తీసుకుని సరిపెల్ల రాజేష్‌కు (మహాసేన రాజేష్‌) కేటాయించింది. ఆయన అభ్యర్థిత్వంపై రెండు పార్టీల్లోనూ వ్యతిరేకత వ్యక్తం కావడంతో చివరకు పి.గన్నవరం జనసేనకు, అమలాపురం టీడీపీకి దక్కాయి.

నాటి పరిణామాలను ఇప్పుడు జనసేన నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. జిల్లా కేంద్రమైన అమలాపురం నుంచి పోటీ చేయాలని తాము పట్టుబట్టినా.. చివరకు టీడీపీకే ఈ సీటు వెళ్లిందని, నియోజకవర్గంలోని కీలక పదవుల్లోనూ సైకిల్‌కే ప్రాధాన్యం దక్కిందని అంటున్నారు. అమలాపురం మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పదవి టీడీపీకి చెందిన అధికారపు జయ వెంకటలక్ష్మికి దక్కింది. అమలాపురం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అముడా) చైర్మన్‌ పదవిని సైతం అదే పార్టీకి చెందిన అల్లాడ సోంబాబుకు కట్టబెట్టారు. ఎమ్మెల్యేతో పాటు మార్కెట్‌ కమిటీ, అముడా వంటి కీలక పదవులన్నీ టీడీపీ ఖాతాలోకి వెళ్లడంతో.. ఇప్పుడు మున్సిపల్‌ చైర్మన్‌ పదవి తమ పార్టీకి ఇవ్వాల్సిందేనని జనసేన నేతలు పట్టుబడుతున్నారు. గత మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీకి నాలుగు కౌన్సిలర్‌ స్థానాలే రాగా, జనసేనకు ఆరు వచ్చాయని వారు గుర్తు చేస్తున్నారు. మొత్తం విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన జనసేన నేతలు.. అమలాపురం మున్సిపాలిటీ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలిసిన సందర్భంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌తో బుధవారం సమావేశమైన జనసేన నాయకులు చైర్మన్‌ పదవి జనసేనకే దక్కేలా చూడాలంటూ మరోసారి తమ వాదన వినిపించినట్టు తెలిసింది. ఇటీవల అమలాపురంలో ఎమ్మెల్యే ఆనందరావుతో పాటు టీడీపీ నేతలు తమకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని వారు ఆ సందర్భంగా ఏకరువు పెట్టారు.

ఎవరి ప్రయత్నాలు వారివి

మున్సిపల్‌ చైర్మన్‌ పదవి జనరల్‌ కేటగిరీలో ఉంటుందనే ప్రచారం జరుగుతూండటంతో జనసేనలో పలువురు నేతలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ పార్టీ నుంచి సీనియర్‌ నాయకుడు, పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఆంతరంగికుడిగా ముద్రపడిన నల్లా శ్రీధర్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ యాళ్ల నాగ సతీష్‌ ఈ పదవిని ఆశిస్తూ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి ముందుగా చైర్మన్‌ పదవిని జనసేనకు ఖరారు చేయించుకునేందుకు పార్టీ పెద్దల వద్ద తమ వాదన వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా మాజీ మున్సిపల్‌ ప్రతిపక్ష నాయకుడు యేడిద శ్రీను కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

ఈ కుర్చీ

మాకే ఇచ్చేయండి

అలా కుదరదు..

ఈ కుర్చీ కూడా మాదే..

దక్కకుంటే.. సహాయ నిరాకరణ?

ఇరు పార్టీల నేతలూ మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని తమ రాజకీయ ప్రాబల్యానికి ప్రతీకగా భావిస్తున్న నేపథ్యంలో వ్యవహారం రసవత్తరంగా మారింది. ఎవరికి అవకాశం వచ్చినా రెండో వారి నుంచి సహాయ నిరాకరణ ఎదురు కానుంది. అమలాపురంలో ఇప్పటికే కూటమి పార్టీల తీరు అతుకుల బొంతగా ఉంది. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఈ విభేదాలు మరింత ముదరనున్నాయి. జిల్లాలో అమలాపురంతో పాటు రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీ ఉన్నాయి. అయితే, కూటమిలో మున్సిపల్‌ పీఠంపై అసలు తలనొప్పి మాత్రం అమలాపురంలోనే కనిపిస్తోంది.

మా అబ్బాయికే ఇవ్వండి

మరోవైపు మున్సిపల్‌ పీఠం కూడా తమకే ఇవ్వాలని టీడీపీ సైతం స్పష్టం చేస్తోంది. తన కుమారుడు మెట్ల సత్యకు చైర్మన్‌ అవకాశం ఇవ్వాలని టీడీపీ నేత మెట్ల రమణబాబు కోరుతున్నట్లు సమాచారం. తనకు ఎమ్మెల్సీ పదవి దక్కలేదని, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి కూడా రాలేదని.. కనీసం తన కుమారుడికి మున్సిపల్‌ చైర్మన్‌ అవకాశమైనా కల్పించాలని పార్టీ పెద్దలను కోరుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement