ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఆహార భద్రతా
విభాగం నివేదిక
అమలాపురం టౌన్: రాజమహేంద్రవరం లాలాచెరువు ప్రాంతంలో గత ఫిబ్రవరి నెలలో సంభవించిన కల్తీ పాల విషాదంపై అప్పట్లో అమలాపురానికి చెందిన న్యాయవాది వి.రమేష్‌చంద్రవర్మ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ఆహార భద్రతా విభాగం ఎన్‌హెచ్‌ఆర్‌సీకి నివేదిక సమర్పించిందని రమేష్‌చంద్రవర్మ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వరలక్ష్మీ మిల్క్ డెయిరీ నుంచి సరఫరా అయిన పాలల్లో ఇథిలీన్ గ్లైకాల్ వంటి ప్రమాదకర రసాయనాలు కలపడం వల్లే బాధితులకు కిడ్నీల వైఫల్యం సంభవించిందని ఆ నివేదిక పేర్కొంది. ఈ తప్పిదం తేలడంతో అప్పట్లో బాధ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపింది. ఈ ఘోర ఘటనతో మృతి చెందిన 16 మంది బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.1.60 కోట్ల పరిహారం అందజేశారని న్యాయవాది రమేష్‌చంద్రవర్మ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని డెయిరీలపై నిరంతర నిఘాతో శాంపిల్స్ పరీక్షలు నిర్వహించే వరకూ తన న్యాయ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
పక్కా ప్రణాళికతో
అటవీ భూముల రీ సర్వే
అమలాపురం రూరల్: జిల్లాలోని రక్షిత అటవీ భూముల రీ సర్వే పనులను పక్కా ప్రణాళికతో చేపట్టాలని ఇన్‌చార్జి కలెక్టర్ వైఖోమ్ నైడియాదేవి అన్నారు. అమరావతి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, భూ పరిపాలన చీఫ్ కమిషనర్ అధికారి జి.జయలక్ష్మి వివిధ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, భూముల రీ సర్వే, 22–ఎ నిషేధిత భూముల జాబితా సవరణ, కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, రక్షిత అటవీ భూముల పురోగతి, ిపీజీఆర్‌ఎస్ వంటి వాటిపై ఆర్‌డీఓలు, తహసీల్దార్లు, ఇతర అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమలాపురం, కాట్రేనికోన, రాజోలుల్లో పెండింగ్‌లో ఉన్న నిషేధిత భూముల కేసులపై తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అల్లవరం మండలం బెండమూర్లంక, ఐ.పోలవరం మండలం గుత్తెనదీవుల్లో రీ సర్వే పనులు పూర్తి చేశారని, మిగిలిన తీర ప్రాంత రక్షిత అటవీ భూముల సర్వే కూడా త్వరితిగతిన పూర్తి చేయాలని నైడియాదేవి ఆదేశించారు.
ఘనంగా గణేశుని ఊరేగింపు
అయినవిల్లి: చవితి ఉత్సవాల్లో భాగంగా అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి వారు మూషిక వాహనంపై బుధవారం మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాల ఘోష నడుమ సాగిన ఈ ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం ఏడు గంటలకు స్వామివారికి ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యాన వేద పండితులు పంచహారతులు ఇచ్చారు. ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ విళ్లా సూర్యనారాయణ, సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.


