సర్కారు తీరుపై సమరానికి సై.. | - | Sakshi
Sakshi News home page

సర్కారు తీరుపై సమరానికి సై..

Jul 30 2026 12:27 AM | Updated on Jul 30 2026 12:27 AM

చంద్రబాబు ప్రభుత్వంపై

శ్రామికుల కన్నెర్ర

రెండేళ్లుగా దగా

పడుతున్నామంటూ ఆవేదన

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా

ఆందోళనకు సన్నద్ధం

నేడు, రేపు కలెక్టరేట్ల వద్ద నిరసన

కపిలేశ్వరపురం: సంపద సృష్టిస్తాను, ప్రజలకు పంచుతాను, ధరలను నియంత్రిస్తాను, యువతకు ఉద్యోగాలిస్తాను అంటూ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు విపరీతంగా ప్రచారం చేశారు. వీటికి తోడు సూపర్‌ సిక్స్‌ పథకాలతో పాటు మరిన్ని హామీలు ఇచ్చారు. ఆయనను నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు, మద్యం సిండికేట్లతో కూటమి నాయకులకు మాత్రమే చంద్రబాబు సంపద అందించారు. సామాన్య ప్రజలను నట్టేట ముంచారు. పెరిగిన నిత్యావసరాల ధరలు, అందని సంక్షేమ పథకాలతో వారందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు, వివిధ శాఖల్లోని కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో కలెక్టరేట్‌ కార్యాలయాలను ముట్టడించనున్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ పరిశ్రమల్లో వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేసే శ్రామికులున్నారు. ప్రభుత్వ స్కీం విభాగాల్లో అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, పారా మెడికల్‌, నర్సింగ్‌ ఉద్యోగులు, 108, 104 సిబ్బంది, శానిటరీ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పని చేస్తున్న కార్మికులు గురువారం ఆయా జిల్లాల కలెక్టర్‌ కార్యాలయాలు వద్ద నిరసన తెలపనున్నారు. ప్రభుత్వ స్కీం వర్కర్లు శుక్రవారం ధర్నా చేసేందుకు సన్నద్ధమయ్యారు.

ప్రధాన డిమాండ్లు

● సుప్రీం కోర్టు తీర్పు మేరకు ప్రతి కార్మికుడికి కనీస వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలి.

● ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ కార్మికుడి కుటుంబానికి వర్తింపజేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి.

● పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా పీఎఫ్‌, ఈఎస్‌ఐ సదుపాయం కల్పించాలి, ఉద్యోగులు, సిబ్బందిపై రాజకీయ వేధింపులు అరికట్టాలి.

చంద్రబాబు పాలనలో సమస్యలివీ..

● ప్రభుత్వ పాఠశాలల్లో నైట్‌ వాచ్‌మన్లకు నెలకు కేవలం రూ.ఆరు వేలు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా గత ఏడు నెలలుగా బకాయి ఉంది.

● అంగన్‌వాడీలకు వేతనాలను పెంచుతామంటూ 2024 జూలైలో ప్రభుత్వ మినిట్స్‌లో రాసినప్పటికీ అమలు చేయడం లేదు. ఐదేళ్ల సీనియారిటీ ఉన్న అంగన్‌వాడీలకు మాత్రమే పదోన్నతి కల్పిస్తామనడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. నవచేతన తదితర యాప్‌లతో వారు అవస్థలు పడుతున్నారు.

● గిరిజన ప్రాంతాల్లోని ఐటీడీఏ, ట్రైబల్‌ వెల్ఫేర్‌, జీసీసీ, ఫారెస్ట్‌, ఏపీ గురుకులాల్లో విద్య, వైద్య శాఖల్లోని కార్మికులకు టైమ్‌ స్కేల్‌ అమలు చేయడం లేదు. వైద్య సేవలు, ఫీవర్‌, ఫైలేరియా, టీబీ, నాన్‌ కమ్యూనిస్టుబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీసీడీ) తదితర సర్వేల్లో నిత్యం ఒత్తిడికి గురవుతున్న ఆశ కార్యకర్తలపై స్పెషల్‌ ఇన్‌టెన్సివ్‌ రివిజన్‌ కార్యక్రమంతో అదనపు భారం మోపారు.

గతంలోనూ ఆందోళనలు

కాకినాడ, రాజమహేంద్రవరం, పోలవరం, అమలాపురం కలెక్టరేట్ల వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు తమ డిమాండ్ల సాధనకై ఈ నెల 10న నిరసన తెలిపారు.

తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ స్టేట్‌ సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఈ నెల 23న కాకినాడ కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు.

ఈ నెల 13న ధవళేశ్వరం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు వినతి పత్రం అందజేయాలనుకున్న అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు నిర్బంధించారు.

అధికారుల వేధింపులకు నిరసనగా ఈ ఏడాది జూన్‌ 10న బండారులంక పీహెచ్‌సీ ఎదుట ఆశ కార్యకర్తలు ధర్నా చేశారు.

తమ వేతనాలు పెంచాలంటూ ఈ ఏడాది జూన్‌ 9న కాకినాడ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, నైట్‌ వాచ్‌మన్లు, పాఠశాలల ఆయాలు ధర్నా చేశారు.

రామచంద్రపురం ఏరియా ఆసుపత్రి వద్ద ఆసుపత్రి పారిశుధ్య కార్మికులు తమకు పెంచిన వేతనాలను అమలు చేయాలంటూ ఈ ఏడాది జూన్‌ 5న నిరసన తెలిపారు.

ఆ ఊసే ఎత్తడం లేదు

గతంలో 42 రోజులు సమ్మె చేసినప్పుడు టీడీపీ నాయకులు తాము అధికారంలోకి రాగానే డిమాండ్లను అమలు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా హామీల ఊసెత్తడం లేదు. అదేమిటని అడుగుతుంటే నిర్భంధిస్తున్నారు.

– జి.బేబీరాణి, ఉపాధ్యక్షురాలు,

సీఐటీయూ అఖిల భారత సంఘం, కాకినాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement