● ఈ ఏడాది తగ్గిపోయిన వరద ప్రవాహం
● పెరిగినట్టే పెరిగి, పడిపోయిన ఇన్‌ఫ్లో
● మరింత తగ్గుతుందని అధికారుల అంచనా
● గడిచిన పదేళ్లలో ఇదే అత్యల్పం
సాక్షి అమలాపురం: ఒకప్పుడు జూలై నెల వచ్చిందంటే ఉప్పొంగే గోదావరి.. ఈసారి మాత్రం ఎల్‌నినో ప్రభావంతో నిస్తేజంగా కనిపిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో సాధారణ స్థాయిలో కూడా వర్షాలు కురవకపోవడంతో గోదావరిలో వరద ప్రవాహం ఆశించిన స్థాయికి చేరడం లేదు. మంగళవారం వరకు కొంత పెరిగినట్టే కనిపించిన వరద.. బుధవారం నాటికి మళ్లీ తగ్గుముఖం పట్టింది. ఎగువన నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మరో రెండు, మూడు రోజులు ఇన్‌ఫ్లో కొనసాగి మరింత తగ్గే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
తగ్గిన ఇన్‌ఫ్లో
ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద మంగళవారం నమోదైన 1.13 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో బుధవారం ఉదయానికి 80,918 క్యూసెక్కులకు పడిపోయింది. కేవలం 24 గంటల్లోనే 32 వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహం తగ్గడం గోదావరిలో ఈ సీజన్ పరిస్థితిని స్పష్టంగా తెలియజేస్తోంది. మంగళవారం డెల్టా పంట కాలువలకు పోగా మిగిలిన 98,006 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. ఇక మంగళవారం ఉదయం 66,218 క్యూసెక్కులు మాత్రమే దిగువకు విడిచిపెట్టారు. ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు లేకపోవడం, అడపాదడపా కురుస్తున్నా అవి సాధారణ వర్షాలు కావడంతో వరద నీటి రాక కూడా బాగా తగ్గిపోయింది.
గతేడాది ఉధృతం
గత ఏడాది ఇదే సమయానికి గోదావరి ఉధృతంగా ప్రవహించింది. ధవళశ్వరం వద్ద గత ఏడాది ఇదే రోజు (29వ తేదీ) సాయంత్రం ఆరు గంటలకు 6.01 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. తర్వాత రోజుల్లో వరద మరింత పెరగడంతో లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తత చర్యలు చేపట్టాల్సి వచ్చింది. అయితే ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. గత ఏడాదితో పోలిస్తే వరద ప్రవాహం లక్షల క్యూసెక్కుల మేర తగ్గిపోవడం గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వర్షాభావ తీవ్రతను తెలియజేస్తోంది.
పదేళ్లలో అత్యల్ప వరద
జలవనరుల శాఖ గణాంకాల ప్రకారం గడిచిన పదేళ్లలో జూలైలో నమోదైన అత్యల్ప వరద ప్రవాహాల్లో ఇదొకటి. సాధారణంగా జూలై చివరి వారానికి గోదావరి ఉధృతంగా ఉంటుంది. జూలై నెలాఖరు మొదలయ్యే వరద ఆగస్టులో ఊగ్రరూపం దాల్చుతుంది. అక్టోబరు వరకు వరద ఉరవడి కొనసాగుతుంది. అక్టోబరు నెలాఖరు సమయంలో కూడా గోదావరి నుంచి 30 వేల క్యూసెక్కులకు పైగా వరద నీటిని దిగువకు వదులుతుంటారు. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వరద రాకపోవడంతో ప్రస్తుత ఖరీఫ్‌కు సాగునీటి పరంగా ఇబ్బందులు లేకపోయినా, గోదావరి డెల్టా వ్యవసాయం, భూగర్భ జలాల నింపుదల, నదీ పర్యావరణ వ్యవస్థపై దీని ప్రభావం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
2022లో భారీగా
ఇదే సమయంలో 2022లో నమోదైన గోదావరి వరదను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. ఆ ఏడాది జూలైలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 25.60 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం నమోదైంది. అది 1986, 2006 తర్వాత గోదావరి చరిత్రలో మూడో అతి పెద్ద వరదగా నిలిచింది. సాధారణంగా గోదావరికి ఆగస్టుల్లో భారీ వరద రావడం సహజం. కానీ ఆ ఏడాది మూడో అతి పెద్ద వరద జూలైలోనే వచ్చింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదైతే తప్ప సమీప రోజుల్లో గోదావరిలో పెద్దగా వరద పెరిగే అవకాశం కనిపించడం లేదు.
సంవత్సరం గరిష్ట ప్రవాహం (లక్షల క్యూసెక్కులు)
1986 35.06 చరిత్రలోనే అతిపెద్ద వరద
2006 28.51 రెండో అతి పెద్ద వరద
2022 25.60 మూడో అతి పెద్ద వరద


