మామిడికుదురు: ఆదుర్రు గ్రామంలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఆది బౌద్ధ స్తూపం వద్ద బుధవారం అంతర్జాతీయ బౌద్ధ భిక్షువులు, ప్రముఖులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహారాష్ట్రకు చెందిన సినీ నటుడు గగన్ మాలిక్, శ్రీలంక బౌద్ధ భిక్షువులు, థాయిలాండ్ బౌద్ధ ప్రతినిధులు వీటిలో పాల్గొన్నారు. హైదరాబాద్‌కు చెందిన కేకే ఫౌండేషన్ డైరెక్టర్ లతా రాజా, అమలాపురం పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు బౌద్ధ సంఘాల అధ్యక్షులు, నాయకులు భాగస్వాములయ్యారు. స్తూపం పరిసరాల్లో బౌద్ధ భిక్షువులు సంప్రదాయ పద్ధతిలో శాంతి మంత్రాలను పఠిస్తూ, విశ్వశాంతి కోసం ధ్యానం చేశారు. ఆదుర్రు బౌద్ధ స్తూపానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను కొనియాడారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఆర్ భూపతి, తాడి సురేష్, బళ్ల శ్రీనివాసరావు పినిశెట్టి శేఖర్, సింధు స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ మేళాలో
29 మంది ఎంపిక
అమలాపురం రూరల్: కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక ఉద్యోగ మేళాలో 29 మంది అభ్యర్థులు వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరందరికీ జిల్లా రెవెన్యూ అధికారి వీర్ల సుబ్బారావు నియామక పత్రాలు అందజేశారు. వికాస జిల్లా మేనేజర్ గొళ్ల రమేష్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగలక్ష్మి, మేజిస్ట్రియల్ సెక్షన్ సూపరింటెండెంట్ రమణ కుమారి, లీగల్ సెల్ సూపరింటెండెంట్ సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల
సమస్యలను ప్రస్తావిస్తా
అల్లవరం: ఆర్టీసీ సంక్షేమానికి సంబంధించి 12వ వేతన సంఘం అమల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, మూడేళ్లు దాటినా కమిటీ ఏర్పాటు చేయకపోవడంతో పాటు డీఏ, ఐఆర్ తదితర అంశాలపై శాసన మండలి సమావేశాల్లో ప్రస్తావించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ హామీ ఇచ్చారు. ఏపీ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అల్లవరం మండలం గోడిలో బుధవారం ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్టీసీలో 16 వేల పోస్టులు భర్తీ చేయకపోవడంతో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. సీ్త్ర శక్తి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి రోజు 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, ఆ రద్దీకి తగినట్టు బస్సులు సమకూర్చలేదన్నారు. వచ్చే ఏడాది పుష్కరాల అవసరాల నిమిత్తం నాలుగు వేల అదనపు బస్సులు కొనుగోలు చేయాల్సి ఉంద న్నారు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల అప్పగించే చర్యలను నిలిపి వేయించాలని, మూసివేసిన డిపోలను తెరిపించాలని కోరారు.
చిక్కని పులి.. ఆగని వేట
దేవరపల్లి: గోపాలపురం మండలం కరిచర్లగూడెం, తొక్కిరెడ్డిగూడెం, గుడ్డిగూడెం, కరగపాడు, బుచ్చియపాలెం, నందిగూడెం గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్ద పులి మంగళవారం రాత్రి అధికారులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకుని పారిపోయింది. కరిచర్లగూడెం శివారులోని మెట్టపై రిజర్వుడు ఫారెస్ట్‌లో పెద్దపులి ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు డ్రోన్, ట్రాకర్ ద్వారా గురించారు. దాన్ని పట్టుకునేందుకు శ్రీశైలం టైగర్ టీం, తూర్పుగోదావరి జిల్లా హనుమాన్ టీం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి 60 మంది సిబ్బందిని ఐదు బృందాలుగా ఏర్పాటు చేశారు. పులి దాగి ఉన్న కొబ్బరి, కోకో తోటను అధికారులు చుట్టుముట్టారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చే సమయంలో గన్ మిస్‌ఫైర్ కావడంతో పులి అక్కడ నుంచి తప్పించుకుని, కరగపాడు, తొక్కిరెడ్డిగూడెం వైపు పారిపోయింది. మార్గం మధ్యలో గేదె దూడపై దాడి చేసి హతమార్చింది.


