ఒకటి నుంచి పశు వైద్యశిబిరాలు | - | Sakshi
Sakshi News home page

ఒకటి నుంచి పశు వైద్యశిబిరాలు

Jul 29 2026 12:10 AM | Updated on Jul 29 2026 12:10 AM

అమలాపురం టౌన్‌: జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఆగస్టు ఒకటి నుంచి పశు వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్టు జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్‌ బి.నాగేశ్వరరావు తెలిపారు. ఇదే సమయంలో పాడి రైతుల ఆర్థికాభివృద్ధి కోసం మహిళా డెయిరీ సహకార సంఘాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు మంగళవారం అమలాపురంలోని పశు సంవర్ధక ఏరియా వైద్యాలయంలో సహాయ సంచాలకులు డాక్టర్‌ ఎల్‌.విజయరెడ్డి అధ్యక్షతన జిల్లాలోని వైద్యాధికారులు, సహాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య శిబిరాలతో పాటు ఆయా గ్రామాల్లోని ఆవులకు లంపి స్కిన్‌ వ్యాధి నిరోధక టీకాలు వేస్తామన్నారు.

తెలుగుదేశమే ఫేక్‌ పార్టీ

ఆ నిజం మంత్రి లోకేశ్‌ తెలుసుకోవాలి

వైఎస్సార్‌ సీపీ నాయకురాలు

జమ్మలమడక నాగమణి

కాకినాడ రూరల్‌: తెలుగుదేశమే ఫేక్‌ పార్టీ అని, ఆ పార్టీ డీఎన్‌ఏ ఏమిటో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ తెలుసుకోవాలని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి హితవు పలికారు. ఆమె మంగళవారం మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీని ఉద్దేశించి లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ఎలా కబళించారో తెలుగు ప్రజలందరికీ తెలుసనన్నారు. ఆ విషయంపై లోకేశ్‌కు అవగాహన లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించి పార్టీని స్థాపించారని తెలిపారు. ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీని దొడ్డి దారిన చేజిక్కుంచున్న వాళ్లే ఫేక్‌ అని స్పష్టం చేశారు. తాజాగా ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు ఇంటింటికి తెలుగుదేశం అంటూ కొత్త డ్రామాకు చంద్రబాబు, లోకేశ్‌ తెరతీశారని మండిపడ్డారు. కానీ తెలుగు తమ్ముళ్లు మాత్రం ప్రజల వద్దకు ఏ ధైర్యంతో వెళ్లాలా అని ఆందోళన చెందుతున్నారన్నారు. వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌ ఇచ్చిన హామీలను కాపీ కొట్టినా, వాటిని ఆ స్థాయిలో అమలు చేయలేకపోతున్నారని మండిపడ్డారు. కూటమి పాలనలో అన్ని రంగాలు తిరోగమనంలో సాగుతున్నాయన్నారు.

31న కాకినాడలో జాబ్‌ మేళా

బాలాజీచెరువు (కాకినాడ): కాకినాడలోని గవర్నమెంట్‌ ఐటీఐ కాలేజీ ఆవరణలో ఈ నెల 31న జాబ్‌ మేళా నిర్వహించనున్నారు. జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాస్‌, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్‌.గోపీకృష్ణ, గవర్నమెంట్‌ ఐటీఐ ప్రిన్సిపాల్‌ వర్మ మంగళవారం ఈ వివరాలను వెల్లడించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌, ఐటీఐ (ఎలక్ట్రికల్‌, ఫిట్టర్‌), ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన, 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలవారు ఆ ఉదయం 10 గంటలకు కాకినాడ గవర్నమెంట్‌ ఐటీఐ కాలేజీకి హాజరుకావాలన్నారు. ముందుగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.నైపుణ్యం.ఏపీ.జీవోవి.ఇన్‌ వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకు 86399 51441, 86398 46568 నంబర్లను సంప్రదించాలని కోరారు.

ప్రధాని సభకు ఆర్టీసీ బస్సులు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ సందర్భంగా నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు జిల్లాలో అర్టీసీ బస్సులు పంపుతున్నామని జిల్లా ప్రజారవాణాధికారి మనోహర్‌ అన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 30, 31, ఆగష్టు 1న పూర్తి స్థాయిలో బస్సులు అందుబాటులో ఉండవని తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

ఫ చెప్పినా వినకుండా..

రహదారులపై ప్రయాణించే వాహనాలు వెనుక వచ్చే వారికి ఇబ్బంది లేకుండా వెళ్లాలి. నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ముందుకు సాగాలి. కానీ కొందరు డ్రైవర్లు పరిమితికి మించి లగేజీ వేసుకుని ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ, వారి మాటలను పట్టించుకోవడం లేదు. జాతీయ రహదారిపై గండేపల్లి మండలం మురారి శివారున మినీ వ్యాన్‌లో పరిమితికి మించి సామగ్రిని తరలిస్తున్నారు. – గండేపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement